కమ్యూనిస్టులు తమ వాయిస్ వినిపించుకోవడానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏర్పాటు చేసిన “10 టీవీ” న్యూస్ చానల్ ఇప్పుడు చేతులు మారిపోయింది. నిర్వహణ భారంగా మారడంతో.. కమ్యూనిస్టులు తాము చెప్పే “బూర్జువా”, బడా పారిశ్రామిక వేత్తలకు “10 టీవీ”ని అమ్మేశారు. దాదాపుగా రూ. 30 కోట్ల రూపాయలకు ఈ చానల్‌ను… మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేశారని.. మీడియా వర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏర్పాటు చేసిన చానల్‌ను.. ఆయా వాటాదారులకు తెలియకుండా..ఎలా అమ్ముతారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనిపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఫిర్యాదు కూడా దాఖలైంది. ఈ ఫిర్యాదు చేసింది కూడా… కామ్రేడ్లే…!
టెన్ టీవీని ఏర్పాటు చేయడానికి సీపీఎం అనుబంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, బీమా, కార్మిక సంఘాల సభ్యుల నుంచి విరాళాలు వసూలు చేశారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో 1,82,000 మంది సభ్యుల నుంచి నిధులు వసూలు చేశారు. కానీ ఆర్వోసీకి మాత్రం 108 మంది పేర్లు మాత్రమే సమర్పించారు. 10టీవీని అమ్మేయడానికి నష్టాలను కారణంగా చూపించారు. ఆర్వోసీకి సమర్పించిన నివేదిక ప్రకారం 2016, 2017 సంవత్సరాల్లో వరుసగా 4.71 లక్షలు, 2.30 కోట్లు లాభం చూపించారు. కార్మికుల కోసం పోరాడే… కామ్రేడ్లు.. 10 టీవీలో పని చేసే వారికి.. సరైన సమయంలో జీతాలు ఇవ్వకుండా.. ఇబ్బంది పెట్టారు. దానికీ ఆదాయం లేదనే సాకునే చూపించారు. ఉద్యోగుల్ని ఇలా ఇబ్బంది పెట్టబట్టే… 10 టీవీ అమ్మకం విషయంలో ఎవరి నుంచీ వ్యతిరేకత రాలేదు. అందు కోసమే… జీతాలు ఆలస్యం చేశారన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
వాటాదారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే చానల్‌ను కమ్యూనిస్టు భావజాలంతో ఎలాంటి సంబంధంలేని ఫక్తు ప్రైవేటు కంపెనీకి విక్రయించేశారు. నిజానికి… రాష్ట్ర విభజన తర్వాత టీవీ చానల్‌ను నడిపేందుకు ఏపీ రాష్ట్ర శాఖ ముందుకు వచ్చినప్పటికీ అనుమతించలేదు. వందకోట్ల ఆస్తులున్న చానల్‌ను కేవలం 30 కోట్లకే విక్రయించినట్లు కమ్యూనిస్టు పార్టీలోని ఇతర నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 10 టీవీ అమ్మకం వ్యవహారం.. అటు సీపీఎంలోనే కాదు.. అటు మీడియాలోనూ కలకలం రేపుతోంది. అయితే.. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు.. ఇది హైలెట్ అవుతోందన్నది మరో కీలక ప్రశ్న..!?