- కేరళలో శబరిమల ఉద్రిక్తత..!
- తమిళనాడులో.. సీబీఐ, ఐటీ అధికారుల వరుస దాడులు..!
- ఏపీలో రాష్ట్రపతి పాలన హెచ్చరికలు..!
- బెంగాల్లో సీబీఐ ప్రయోగాలు..!
బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో.. ఈ అలజడి ఎందుకు రేగుతోంది..?. ఎన్నికలకు ముందు వీలైనంత ప్రశాంతంగా ఉండాల్సిన రాష్ట్రాల్లో ఈ ఉద్రిక్తతలు ఎందుకు ఏర్పడుతున్నాయి. అన్నీ నేరుగా.. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్నవే కావడం దేనికి నిదర్శనం…?
భారతీయ జనతా పార్టీ రెండో సారి అధికారంలోకి రావడానికి.. ఇప్పుడు అనుభవిస్తున్న అధికారాన్నే ఓ అస్త్రంగా చేసుకుందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఎలాంటి అలజడులు లేవు. గట్టిగా పోరాడుతున్న వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకున్నారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రం.. నేరుగా… ఆయా పార్టీల నేతలపైనే కాదు.. ఏకంగా అధికార యంత్రాంగంపైనా విరుచుకుపడుతున్నారు. తమిళనాడు, కేరళ, ఏపీ, బెంగాల్ అధికారులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్ల సర్వీసులో.. ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. ఆ ఆరోపణ పట్టుకుని.. వారిని టార్గెట్ చేస్తూండటం కలకలం రేపుతోంది.
బీజేపీ ఇదంతా చేయడానికి కారణం.. బీజేపీయేతర ప్రభుత్వ యంత్రాంగాలపై పట్టు సాధించడమే. ఎన్నికల సమయంలో.. ఆయా రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం.. పట్టు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కాకుండా.. తమ చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమే.. రాష్ట్రాల్లో అలజడులకు కారణం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారం అనుభవిస్తూ.. ఆ అధికారంతో.. ఎలాంటి ప్రయోజనాలు సాధించవచ్చో.. ఇప్పటి వరకూ.. బీజేపీ అన్ని ప్రయోజనాలను పొందింది. అందుకే.. తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ చేశారు. ఆయా ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి … తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.