సంక్రాంతి…సమ్మర్..దసరా..ఇవీ తెలుగు సినిమాలకు అసలైన సీజన్లు. ఈ సీజన్లు స్టార్ట్ అయ్యే లోగానే, అప్పుడు విడుదల కాబోయే సినిమాల మీద ఓ లెక్కలు, ఒక అంచనా, వీలయినంత బజ్ వచ్చేస్తాయి. పైగా ఈ సీజన్లకు విడుదలయ్యే సినిమాల వ్యవహారం కూడా అలాగే వుంటుంది. ప్రచారం మొదలుపెట్టకుండానే బజ్ స్టార్ట్ అయిపోతోంది. అలాంటి క్రేజ్ వున్న సినిమాలే సాధారణంగా ఈ సీజన్లకు రెడీ అవుతుంటాయి.
2019 సంక్రాంతి సీజన్ సినిమాల ఫలితం ఎలా వున్నా, క్రేజ్, బజ్ తదితర విషయాల్లో రెండు మూడునెలల ముందు నుంచే హడావుడి స్టార్ట్ అయింది. ఇక రానున్నది సమ్మర్. ఈ సీజన్ కు మహేష్ బాబు మహర్షి, నాని జెర్సీ, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, శర్వానంద్-సుధీర్ వర్మ, నాగ్ చైతన్య మజిలీ, సినిమా ప్రస్తుతానికి సమ్మర్ కు షెడ్యూలు అయ్యాయి.
వీటిలో ఏ ఒక్క సినిమాకు వాటి రేంజ్ కు సరిపడా బజ్ లేకపోవడం విశేషం. మహర్షి సినిమా అంటే మహేష్ బాబు కాబట్టి, దగ్గర చేసి ఆటోమెటి్క్ గా బజ్ వస్తుందని అనుకోవచ్చేమో? కానీ మిగిలిన వాటికి అలాంటి చాన్స్ లేదు. శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా సుదీర్ఘంగా సెట్ మీదే వుంది. ఇంకా మరో ముఫై రోజుల షూట్ వుంది. టైటిల్ ఫిక్స కాలేదు. అలా అని శర్వానంద్ హిట్ ట్రాక్ లో లేడు. సుధీర్ వర్మది అదే పరిస్థితి.
నాగ్ చైతన్య సంగతి చెప్పనక్కరలేదు. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. పైగా మజిలీ అన్న టైటిల్ అంతగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. సమంత ఫ్యాక్టర్ ఒక్కటే ఆ సినిమాకు ఆశ.
నాని జెర్సీ మీద కాస్త ఆసక్తి వుంది. కానీ ఒక వ్యక్తి ఎమోషనల్ జర్నీ లాంటి భావోద్వేగాల సినిమాలు జనాలకు ఎంత వరకు పడతాయనేది చూడాలి. పైగా ప్రేమ నేపథ్యంలో భావొద్వేగాలు అంటే ఓకె. కానీ తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
డియర్ కామ్రేడ్ సినిమా ఆరంభంలో చకచకా షూట్ జరిగింది. ఆ తరువాత వర్క్ ఫినిష్ అయిపోయిందన్న టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతం అంతా సైలంట్ గా వుంది.
మొత్తం మీద సమ్మర్ సినిమాల మీద ఆసక్తి ప్రస్తుతానికైతే అంతగా కనిపించడం లేదు. వినిపించడం లేదు. సినిమాల కంటెంట్, ఫస్ట్ లుక్ లు, టీజర్లు ఒక్కోటీ బయటకు వస్తే ఏమయినా ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో చూడాలి. టోటల్ గా ఈ సమ్మర్ కూడా దాదాపు 250 కోట్ల మేరకు బిజినెస్ జరుగుతుంది. వసూళ్లు ఎలా వుంటాయో చూడాలి.