వామపక్షాలతో జనసేన కలిసి ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. భాజపాని పవన్ వ్యతిరేకించడంతోనే జనసేనతో కలిసి వెళ్లొచ్చని తమకు అనిపించి ముందుకొచ్చామంటున్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… పవన్ లో వెంటనే స్పందించే గుణం ఉందనీ, చురుకుదనం ఉందనీ, చిరంజీవిలో లేనిది అదేననీ, అది ఉంటే రాజకీయాల్లో రాణిస్తారన్నారు. రాజకీయాలపై పవన్ స్పష్టత, ఒకే అంశంపై సుదీర్ఘంగా నిలకడగా నిలబడి ఉండటంపై మాట్లాడుతూ… ‘అదే ఉంటే రాజకీయాల్లో ఇంకా ముందుకుపోయేవాడు కదా’ అంటూ నారాయణ చమత్కరించారు.
ఆంధ్రాలో వైకాపాతో వామపక్షాలకు మొదట్నుంచీ సరైన టెర్మ్స్ లేవన్నారు నారాయణ. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ… ‘ఆయన ఒక పొలిటికల్ పర్సనాలిటీగా ఎదగలేదు. ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. సెక్టోరియన్ పద్ధతిలో ఉంటుంది’ అన్నారు. అందుకే వాళ్లతో సయోధ్యకి ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదన్నారు. ఎన్నికల ముందు పూర్తిగా కనిపించకపోయినా… ఫలితాలు వచ్చాక వైకాపా, బీజేపీ, టి.ఆర్.ఎస్.కి మధ్య సయోధ్య కుదురుతుందని నారాయణ చెప్పారు. ఆంధ్రాలో వైకాపా, తెలంగాణలో తెరాస గెలుస్తుందనీ.. కేంద్రంలో కలిసి పనిచేద్దామని ఇప్పటికే ఆ రెండు పార్టీలూ చెబుతున్న పరిస్థితి ఉందన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ తప్ప హోదా ఇవ్వమంటూ ప్రధాని చెప్పిన తరువాత… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చర్చించా అన్నారు నారాయణ. ఆంధ్రాకి మోడీ సాయం చేయరనీ, కాబట్టి ఎన్డీయే నుంచి బయటపడి దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకుల ఐక్యత ఉద్యమానికి శ్రీకారం చుడితే బాగుంటుందని, అది మీ వల్ల అవుతుందని అన్నానని చెప్పారు. అయితే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంతో ఎలాగోలా పనులు చేసుకోవాలనీ, ఇప్పుడే బయటకి వచ్చేస్తే అమరావతి మీద లిటిగేషన్ పెడతారనీ, పోలవరాన్ని ఇబ్బందుల్లో పెడతారనీ, కొన్నాళ్లు సామరస్యంగానే ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు తనతో చెప్పినట్టు నారాయణ వివరించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా అనుకోకుండా భాజపాకి వ్యతిరేకంగా తిరగబడ్డారనీ, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని పవన్ తో ప్రయాణం మొదలుపెట్టామని నారాయణ చెప్పారు.