కమల్‌హాసన్ – ఇళయరాజా… వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ గీతాలొచ్చాయి. తెలుగులో అయితే సాగర సంగమం, స్వాతిముత్యం, గుణలాంటి సినిమాల్ని అస్సలు మర్చిపోలేం. తన సంగీతంతో కమల్ విజయంలో ఇళయరాజా కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. ఇప్పుడు కమల్‌కి విలువైన సలహా కూడా ఇచ్చార్ట.
కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాలలో దిగాలని యోచిస్తున్నారు. అయితే కమల్ని రాజకీయాల్లో చేరమని మొట్ట మొదటిగా సలహా ఇచ్చింది ఇళయరాజానేనట. ఈ విషయాన్ని కమల్ స్వయంగా చెప్పారు. ”ఇళయరాజా నాకు సోదర సమానుడు. అంతేకాదు… గురువు కూడా. రాజకీయాల్లో చేరమని ఆయనే సలహా ఇచ్చార”న్నారు కమల్ హాసన్.
ఇళయరాజా 75వ పుట్టిన రోజు సందర్భంగా తమిళ సినీ పరిశ్రమ ‘ఇళయరాజా 75’ అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘ప్రపంచంలోనే గొప్ప సంగీత జ్ఞాని ఇళయరాజా. ఆయన స్వరపరిచిన పాటల్లో 60 శాతం పాటలకు ఆయనే పల్లవి రాశారు. ఎంతోమంది దర్శకులకు పారితోషికం లేకుండా పనిచేశారు. నా సినిమాలకీ మంచి పాటలు ఇచ్చారు. కానీ.. నాకంటే కమల్ హాసన్ సినిమాల్లో పాటలు బాగుంటాయి. నాతో పోలిస్తే కమల్ సినిమాలకే ఆయన మంచి సంగీతం అందించార’న్నారు.
వెంటనే మైకు అందుకున్న ఇళయరాజా స్పందిస్తూ.. ”నువ్వేమో అలా అంటావు. కమల్ ఏమో.. ‘రజనీకే మంచి పాటలు ఇస్తారు’ అని చెబుతుంటాడు. నేను మాత్రం మీ ఇద్దరికీ మంచి సంగీతమే అందించా” అంటూ చమత్కరించారు.