ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ రీమేక్‌ల జోలికి వెళ్లని నిర్మాత దిల్‌రాజు. మొట్టమొదటి సారి ఓ తమిళ కథపై మనసు పారేసుకన్నాడు. అదే.. ’96’. తమిళంలో ఘన విజయం సాధించడమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకుల మనసుల్నీ, విశ్లేషకుల ప్రసంశలనూ గెలుచుకున్న చిత్రమిది. అక్కడ విజయ్‌సేతుపతి, త్రిష నటిస్తే.. ఇక్కడ ఆ పాత్రలకు గానూ శర్వానంద్, సమంతలను తీసుకున్నారు.
దిల్‌రాజు చేతిలో ఈ సినిమా పడగానే.. ఆయన శైలి మార్పులూ, చేర్పులూ ఉంటాయని ఆశిస్తారంతా. దిల్‌రాజు కూడా అదే మాట చెబుతున్నాడు. కాకపోతే.. సీన్ బై సీన్.. మక్కీకి మక్కీ తెలుగులో దించేయడానికే దిల్‌రాజు మొగ్గు చూపిస్తున్నాడని టాక్. దానికి కారణం కూడా ఉంది. తమిళంలో ఈ చిత్రం తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ ‘ఈ సినిమాలో మార్పులు చేర్పులూ చేయకూడదు. చేస్తే ఆ ఫీల్ దెబ్బతింటుంది’ అని గట్టిగా చెప్పాడట. ఆ మాటతో దిల్‌రాజు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది. డైలాగులతో సహా.. తమిళంలో ఉన్నదాన్నే తెలుగులోకి తర్జుమా చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. మార్పుల పేరుతో మాతృకని పాడు చేసిన సంగతులెన్నో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు తీసినా ఫీల్ మిస్ అయిన అనుభవాలెన్నో కనిపిస్తాయి. మరి ఈ రెండింటిలో `96` ఏ జాబితాలో చేరుతుందో కాలమే చెప్పాలి.