ఓ విజయం వచ్చాక చలన చిత్ర పరిశ్రమలో వ్యక్తుల ప్రవర్తన మారుతుంటుంది. తమ గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. జీవిత రాజశేఖర్ మాత్రం భారంగా గడిచిన రోజులను చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకాడలేదు. నిజాయతీని మెచ్చుకోవాలి.
గరుడవేగ చిత్రానికి ముందు పదేళ్ల కాలంలో రాజశేఖర్ ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఆయన సినిమాలపై ఆసక్తి కనబరచిన ప్రేక్షకులు తక్కువే. అటువంటి సమయంలో గరుడవేగ విజయాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. గరుడవేగ విజయం తర్వాత రాజశేఖర్ నటిస్తున్న సినిమా కల్కి. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ నిజాలు మాట్లాడారు. గరుడవేగ విజయాన్ని తన ఖాతాలో వేసుకోకుండా దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు క్రెడిట్ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ మాటల్లో కొన్ని…
– మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా… కెరీర్ కనుక్కోలేం. హీరోగా రాజశేఖర్ గారి కెరీర్ పాతాళానికి వెళ్లిపోయింది. మళ్లీ మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తామా? రామా? అనుకుంటున్న సమయంలో ప్రవీణ్ సత్తారు మ్యాజిక్ చేశారు. గరుడవేగ తో హిట్ ఇచ్చారు.
– గరుడవేగ తర్వాత ఏ సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ప్రశాంత్ వర్మ కల్కి కథ చెప్పారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రమే తాను ఇస్తానని… డైరెక్షన్ చేయనని అబ్బాయి అన్నారు. ‘అ!’ విజయం తర్వాత ప్రశాంత్ వర్మ కు చాలా అవకాశాలు వచ్చాయి. రాజశేఖర్ గారితో కాకుండా వేరే హీరోలతో అతను సినిమా చేసుకోవచ్చు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తే బాగుంటుందని మేం అనుకున్నాం. చివరకు, తను ఒప్పుకున్నాడు. అప్పుడు చాలా సంతోషించా. ప్రశాంత్ వర్మ కోసం కొన్ని రోజులు ఎదురు చూశాం. (గరుడవేగ విజయం తర్వాత మేమే గొప్ప అన్నట్టు జీవిత రాజశేఖర్ మాట్లాడకుండా.. యువ దర్శకుడైన ప్రశాంత్ వర్మ కు గౌరవం ఇచ్చారు)
– ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం. తీసి విడుదల చేయడం ఇంకా కష్టం. విడుదల చేసిన తర్వాత మన డబ్బులను మన ఇంటికి తెచ్చుకోవడం ఇంకా ఇంకా కష్టం. ఓ మహిళగా నేను సినిమా తీయడం కష్టమే. మా కష్టాలను అర్థం చేసుకుని సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన సి కళ్యాణ్ అన్నయ్యకు థాంక్స్.