భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు… ఏపీ పర్యటన చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆయన ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్లి ఉంటారు కానీ.. జనం లేరని బహిరంగసభను రద్దు చేసుకున్న ఘటనలు ఎప్పుడూ జరిగి ఉండవు. నిరసనలతో సభలు ఆగిపోయి ఉంటాయి కానీ.. జనం లేరని.. ఊసురుమన్న సందర్భాలు ఉండకపోవచ్చు. కానీ మొదటి సారి.. ఏదీ ఏపీలోనే ఆయన జనం లేక బహిరంగసభను రద్దు చేసుకున్నారు. బస్సు చుట్టూ మూగిన రెండు వందల మందిని ఉద్దేశించి ప్రసంగించి… మ..మ అనిపించారు. అయితే.. ఆ ప్రసంగం ఏమైనా ఆకట్టుకుందా.. అంటే… వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబే వస్తారని… ఢిల్లీలో రాహుల్ వస్తారని.. జనం భావించేలా… బీజేపీకి నెగెటివ్ ప్రచారం చేసి వెళ్లారు.
గత ఎన్నికల సమయంలో మోదీ ప్రధాని అవుతారని గ్రహించి.. చంద్రబాబు మాతో పొత్తు కోసం పాకులాడారని పలాసలో అమిత్ షా గట్టిగానే విమర్శించారు. అంతటితో ఆగితే సరిపోయేది.. కానీ ఇప్పుడు.. కాంగ్రెస్‌తో కలసి వెళ్లేందుకు తహతహలాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అంటే.. గత ఎన్నికల్లో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు ఊహించి పొత్తుల కోసం వెంపర్లాడారో.. ఇప్పుడు అలా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని అంచనా వేసి అలా వెంపర్లాడుతున్నారనేది.. అమిత్ షా ఉద్దేశం. అంటే చంద్రబాబు కరెక్ట్‌గా అంచనా వేస్తున్నట్లేనా..?. బీజేపీ పరిస్థితి బాగో లేదని.. అమిత్ షా పరోక్షంగా చెప్పినట్లేనా..? . అంతే కాదు.. ఎన్నికల తర్వాత.. చంద్రబాబు మళ్లీ ఎన్డీఏ దగ్గరకు వస్తారని.. మొహం మీదే తలుపేస్తామని.. రానివ్వబోమని కూడా.. చెప్పుకొచ్చారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తారని.. పరోక్షంగా చెప్పినట్లేనా..?. ఓడిపోతే.. ఎవరూ చంద్రబాబును పట్టించుకోరు. ఆయన ఏపీలో అధికారంలో ఉంటేనే… అదీ కూడా కేంద్రంలో బీజేపీ ఉంటేనే… సహకారం కోసం వస్తారేమో..? అంటే.. చంద్రబాబు మళ్లీ గెలుస్తారని.. నిధుల కోసం తమ దగ్గరకే వస్తారని… అమిత్ షా చెప్పదల్చుకున్నారా..?
ఏపీలో అమిత్ షా పర్యటన.. అత్యంత నిరుత్సాహ పూరితంగా సాగింది. ఆయన ప్రసంగంతోనే కాదు.. నేతలు ఏర్పాట్లలో కూడా ఫెయిలయ్యారు. అమిత్ షా వస్తున్నారని.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి..ఓ మాదిరి నేతలంతా తరలి వచ్చారు. వచ్చే వారు కనీసం.. ఓ యాభై మందిని తెచ్చినా సభా ప్రాంగణం నిండిపోయేది. కానీ ఆ మాత్రం ప్రజాబలం ఉన్న వారెవరూ లేకపోవడంతో… పరిస్థితి మారిపోయింది. చివరికి పరువు పోయింది.