ప్రకాశం జిల్లా చీరాల ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గం లోని తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రత్యర్దులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ తన రాజకీయ నిర్ణయాన్ని పరోక్షంగా నాయకులకు వివరించారు. త్వరలో ఆయన జగన్ ను కలవనున్నట్లు సమాచారం. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటే ఆయన కూడా.. జగన్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన వైసీపీలో చేరబోతున్నట్లు చెప్పుకున్నారు. కానీ .. చంద్రబాబు.. పిలిచి మాట్లాడటంతో ఆగిపోయారు. ఇప్పుడు మళ్లీ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్య అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుండి రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమంచి తదనంతర రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తన ప్రత్యర్దిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో పాటు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవి కూడా కట్టబెట్టడం ఆమంచికి ఇబ్బందికరంగా మారింది. తనకు వ్యతిరేకంగా నాయకత్వాన్ని చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారని ఆమంచి భావించారు. వైసీపీ అధిష్టానం ఆమంచిని పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపటంతో కార్యకర్తలకు తన మనోగతాన్ని తెలియజేసి వైసీపీలో ఎప్పుడు చేరేది ప్రకటించనున్నారు.
చీరాల నియోజకవర్గంలో.. సొంత అనుచర వర్గాన్ని ఆమంచి పెంచుకున్నారు. వైసీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో.. ఆయనను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పర్చూరు నియోజకవర్గంలోనూ ఆమంచికి అనుచరవర్గం ఉంది. ఆయన చేరికతో.. రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.