మాజీ ఆర్మీ జనరల్ కెవి కృష్ణారావు (93) ఈరోజు హైదరాబాద్ లో కన్ను మూశారు. ఆయన జూలై 16, 1923లో విజయవాడలో జన్మించారు. 1942లో ఆర్మీలో చేరారు. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో పాల్గొని అపూర్వ దైర్యసాహసాలు ప్రదర్శించారు. అందుకు ఆయనకి ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకం ఇచ్చి గౌరవించింది. ఆ తరువాత ఆయనకు లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి పొంది 1974 నుండి 78 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పనిచేసారు.
భారత్ భవిష్యత్ సైనికావసరాలకి తగిన సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, సాంకేతిక శిక్షణ వగైరాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఏర్పాటు చేయబడిన నిపుణుల కమిటీకి ఆయన చైర్మన్ గా మార్గదర్శనం చేసారు. జనరల్ కృష్ణారావు జూన్ 1, 1881న ఆర్మీ జనరల్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆర్మీలో చాలా ప్రతిష్టాత్మకంగా భావింపబడే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటికి ఆయన చైర్మన్ గా కూడా వ్యవహరించారు.
1983లో పదవీ విరమణ చేసిన తరువాత ఆయన సమస్యాత్మక రాష్ట్రాలయిన జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ మరియు త్రిపురలకు గవర్నరుగా కూడా వ్యవహరించారు. వాటిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రెండుసార్లు ఆయన గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఈ బాధ్యతలన్నిటినీ ఎంతో సమర్ధంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. తరువాత ఆయన తన అనుభవాలన్నిటికీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ నేషన్ అనే పుస్తకాంలో పొందుపరిచారు.