ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేరికలు తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. కర్నూలు జిల్లా రాజకీయం ఎటూ తేలడం లేదు. కోట్ల కుటుంబం ముఖ్యమంత్రిని గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు. వివిధ నియోజకవర్గాలలో జరుగుతున్న సమావేశాల నేపధ్యంలో కర్నూలు తెలుగుదేశం రాజకీయాల్లో కలకలం బయలుదేరింది. కోట్ల వర్గం కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు, డోన్, ఆలూరు, నియోజకవర్గాల అసెంబ్లీ టిక్కెట్లను తమకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమైనా ఉంటే.. సీఎం తమను సంప్రదిస్తారని కేఈ వర్గీయులు అనుకున్నారు. కానీ సీఎం ఎక్కడా కోట్ల విషయం ప్రస్తావించకపోవడంతో.. టెన్షన్ ఉండబట్టలేకే వారే సీఎం వద్దకు వెళ్లారు. కోట్ల వర్గం చేరికపై నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా సాగిన కెఈ సోదరుల అసంతృప్తి ఏకంగా ముఖ్యమంత్రి వద్దకు చేరింది.
కెఈ సోదరులు ముగ్గురు మంగళవారం ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వెళ్లారు. కర్నూలు జిల్లాలో కోట్ల వర్గం చేరికపై సాగుతున్న ప్రచారం, పత్రికల్లో వస్తున్న వార్తలు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ వంటి అంశాలను నేరుగా చంద్రబాబుతోనే చర్చించాలని కెఈ సోదరులు నిర్ణయించుకున్నారు. కోల్ కతా వెళ్లే హడావుడిలో ఉన్న చంద్రబాబు కెఈ సోదరులతో బుధవారం మాట్లాడుదామని చెప్పి వెళ్లిపోయారు. చంద్రబాబు ముందు.. కేఈ సోదరులు.. కొన్ని ప్రతిపాదనలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని కేఈ వర్గం వాదన. అయితే ఆయన సతీమణి కూడా.. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే పోటీ చేయాలని… నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న డోన్ సీటు ఆమెకు ఎలా ఇస్తారనే వాదన బలంగా వినిపించడం ప్రారంభించారు.
వాదన ఏదైనప్పటికీ.. డోన్, పత్తికొండ అసెంబ్లీ స్థానాలు మాత్రం.. కచ్చితంగా కేఈ కుటుంబానికే ఇస్తే… కోట్ల చేరికపై.. ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం లేదని…ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కర్నూలు రాజకీయం కేఈ సోదరుల అసంతృప్తితో కొద్దికొద్దిగా మారుతోంది. కర్నూలు రైతుల కోసం.. మూడు ప్రాజెక్టులు నిర్మించాలని తాను సీఎంను అడిగానని.. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీలో చేరుతానని.. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి… పదే పదే చెబుతున్నారు.