తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదు అని తెలుగులో ఓ సామెత ఉంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం అని కొందరి ఉద్దేశించి అప్పుడప్పుడూ వాడుతూ ఉంటారు. ఆ మధ్య తాప్సీ, ఆ తర్వాత రాధికా ఆప్టే.. ఇప్పుడు అమృతారావు.. ఇలాంటివారు కూడా అలాంటివారేనేమో..! లేకుంటే తెలుగు సినిమాల్లో నటించి, తెలుగు నిర్మాతల సొమ్ము తిని, తెలుగు సినిమాల గురించి పక్కకెళ్లి తప్పుగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం? అని కృష్ణానగర్‌లో అందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు.
తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా ఎంకరేజ్ చేయకుండా పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ప్రవర్తించే మేకర్స్ కు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని కూడా అంటున్నారు.
తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రను సరిగా రాయరని, నాయికకు సరైన ఇంపార్టెన్స్ ఉండదని అందుకే తాను `అతిథి` తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదని తాజాగా అమృతారావు స్టేట్మెంట్ ఇచ్చింది. `అతిథి`లో మహేష్ కు సరిసమానంగా తన పాత్ర ఉండటంతోనే నటించినట్టు కూడా ఈ భామ తెలిపింది. ఆ తర్వాత నెలకు ముగ్గురు నిర్మాతలు తలుపు తట్టేవారనీ, అయినా తాను ఒక్క కథను కూడా ఒప్పుకోలేదని చెప్పింది. ఈభామకన్నా ముందు రాధికా ఆప్టే కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది.
ఢిల్లీ గర్ల్ తాప్సీ ఏకంగా రాఘవేంద్రరావు స్టైల్‌నే దుయ్యబట్టింది. ముంబై మీడియాతో మాట్లాడుతూ తన బొడ్డుమీద కొబ్బరు చిప్పలు వేశారని వ్యంగ్యంగా మాట్లాడింది.
ముంబై భామలు తెలుగు పరిశ్రమ గురించి ఇలా మాట్లాడటం ఒక కోణం. దక్షిణాది హీరోయిన్లు (మలయాళ, తమిళ్, కన్నడ) మాత్రం తెలుగు పరిశ్రమ గురించి చాలా గొప్పగా చెబుతారు. తెలుగు పరిశ్రమలో నాయికను దేవతను చూసినంత గొప్పగా చూస్తారని ఎన్నో సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మన దక్షిణాది సంస్కృతి తెలిసిన హీరోయిన్ల మాటకు, కొందరు ఉత్తరాది అమ్మాయిలు చేసే ఆరోపణలకు అసలు ఈ విషయంలో పొంతనే ఉండటం లేదు.
ఇకనైనా ఈ విషయం గురించి దర్శకనిర్మాతలు ఆలోచించాలి. రచయితలు కూడా కథలు రాసేటప్పుడు నాయికల పాత్రలు కూరలో కరివేపాకులా ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే ఇక్కడ సినిమాలు చేసినన్నాళ్లూ చేసి, ఆ తర్వాత తమ తమ స్థానాల్లో మీడియాతో మాట్లాడే కొందరు నాయికలు చేసే కామెంట్స్ ను భరించాల్సి వస్తుందన్నది వాస్తం.