‘ఆర్.ఎక్స్. 100’తో దర్శకుడిగా పరిచయమైన రామ్గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. మొదటి సినిమా అతడికి మంచి పేరు తీసుకు వచ్చింది. తాజాగా రెండో సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడీ దర్శకుడు. అజయ్ భూపతితో సినిమా చేయనున్నట్టు తన పుట్టినరోజు వేడుకల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రకటించిన విషయం గుర్తుండే వుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అజయ్ భూపతి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు ‘మహా సముద్రం’ టైటిల్ ఫిక్స్ చేశార్ట. వర్మ శిష్యుడు కృష్ణవంశీ ‘సముద్రం’ అని ఓ సినిమా తీశాడు. ఇప్పుడీ శిష్యుడు ‘మహాసముద్రం’ అంటున్నాడు.
‘ఆర్.ఎక్స్. 100’ ప్రేమలో మోసపోయిన ఓ యువకుడి కథ అయితే, ‘మహాసముద్రం’ మాఫియా నేపథ్యంలో కథ అట! దర్శకుడు ‘ఆర్.ఎక్స్. 100 నుంచి బయటకు వచ్చి ‘మహాసముద్రం’పై ఫోకస్ పెట్టాడట. ‘ఇందులో బెల్లంకొండ సరసన కథానాయికగా సమంతను తీసుకోవాలని అనుకుంటున్నార్ట.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’లో సమంత కథానాయికగా నటించారు. మరో సారి ‘మహాసముద్రం’లో ఈ జోడీ సందడి చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సమంతతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నార్ట. పెళ్లి తరవాత సినిమాల ఎంపికలో సమంత జాగ్రత్త వహిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా వుంటున్నారు. కథ, అందులో పాత్ర నచ్చితే సినిమా చేయడం పెద్ద విషయం కాదు.