నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కిన చిత్రం `యన్.టి.ఆర్. కథానాయకుడు`. దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం `మహానాయకుడు`. ప్రస్తుతం `మహానాయకుడు` చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ రోజుతో యన్టీఆర్, బసవతారకమ్మను చూసిన క్షణాలకు సంబంధించిన సీన్లు పూర్తి కానున్నాయి. ఇందులో 16 ఏళ్ల బసవతారకమ్మగా `ప్రస్థానం`, `ఏమో గుర్రం ఎగరావచ్చు` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన గ్రీష్మనేత్రిక నటిస్తోంది. యంగ్ ఎన్టీఆర్‌గా బెంగుళూరుకు చెందిన తరుణ్ నటిస్తున్నారు. వీరిద్దరి మీద డ్యూయట్ తీస్తున్నట్టు తెలిసింది. బుధవారం తెరకెక్కించే ఎపిసోడ్‌తో యంగ్ ఎపిసోడ్ పూర్తయినట్టే. `మహానాయకుడు` అనగానే కేవలం తారక రామారావు రాజకీయ ప్రస్థానం మాత్రమే ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అయితే రామారావు నాటకాల్లో నటించిన విషయాలు, ఆయన చిన్నతనం, యవ్వనానికి సంబంధించిన పలు ఆకట్టుకునే అంశాలు ఇందులో పొందుపరుస్తున్నారట క్రిష్. సో `మహానాయకుడు`లోనూ రాజకీయ అంశాలతో పాటు కుటుంబపరమైన విషయాలు పుష్కలంగా ఉంటాయన్నది టాక్.