ఉన్నట్లుండి ఉరుములేని పిడుగులా ఓ ప్రకటన ఇచ్చేసాడు హీరో రామ్ చరణ్. వినయ విధేయ రామ సినిమా కోసం పడిన కష్టం తలుచుకుని, అది వృధా అయిన వైనం తలుచుకుని అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు చెప్పేసాడు. ఇదంతా దర్శకుడు బోయపాటిని అన్యాపదేశంగా టార్గెట్ చేయడం తప్ప వేరు కాదని గుసగుసలు మొదలయ్యాయి. సినిమాను పాడుచేసి, తన ఇమేజ్ ను దెబ్బతీసిన బోయపాటిని టార్గెట్ చేయడం తప్ప ఇధి వేరు కాదని టాక్ వినిపించడం ప్రారంభమైంది.
ఇదిలా వుంటే చరణ్ వేసిన ఈ స్టెప్ వెనుక మరో హీరో ఎన్టీఆర్ ప్రోత్సాహం వుందనే కొత్త గుసగుస ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎందుకంటే దమ్ము సినిమా తరువాత నుంచి బోయపాటికి ఎన్టీఆర్ కు బాగా బెడిసిందని, సందు, సమయం దొరికినపుడల్లా ఎన్టీఆర్ ప్రయవేట్ డిస్కషన్లలో బోయపాటి మీద సెటైర్లు వేస్తుంటారని టాక్ వుంది. చరణ్-ఎన్టీఆర్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. పైగా ఇటీవల ఇద్దరూ ఎక్కువగా కలిసి వుంటున్నారు.
ఈ నేపథ్యంలో వినయ విధేయ సినిమా మీద ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే చరణ్ ఈ ప్రకటన చేసి వుంటారని సినిమా జీవులు అనుమానిస్తున్నారు. చరణ్ గతంలో ఇలాంటివి ఎప్పుడూ చేయలేదని, శ్రీనువైట్లను కానీ, ఇంకవరిని కానీ ఇలా టార్గెట్ చేయలేదని, పైగా ఇటీవల చరణ్ చాలా సాఫ్ట్ అయ్యారని, అలాంటిది, ఇప్పుడు వున్నట్లుండి ఇలా చేయడం వెనుక ఎన్టీఆర్ వుండి వుండాలని అనుమానిస్తున్నారు.
బోయపాటి త్వరలో బాలయ్యతో సినిమా చేయబోతున్నారు. అలాగే బన్నీతో మళ్లీ సినిమా వుంటుందని టాక్ వుంది. ఈ రెండింటి నేపథ్యంలో బోయపాటి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే ఇలా చేసారని, యాంటీ మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ట్రోలింగ్ కు సమాధానం ఇవ్వడం అనే పాయింట్ కూడా దీని వెనుక వుందని, ఇంత వ్యూహం, ఇంత ఆలోచన చరణ్ చేయరని, దీని వెనుక ఎవరి ప్రోద్బలమో వుండి వుండాలని, అది ఎన్టీఆర్ అయినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.