వైసీపీ నేతలు తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో కానీ… ఏది చేయకూడదో అదే చేస్తున్నారు. పోలీసులపై నమ్మకం లేదంటూనే.. వారికి ఎన్నికల్లో అనుకూలంగా పని చేసేందుకు లంచాలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి మరీ డబ్బు కవర్లు అందించేదుకు ప్రయత్నిస్తున్నారు. వెంకట రామారావు అనే నేత.. తనను.. కలవమని పదే పదే ఫోన్లు చేయడంతో పాటు.. పోలీస్ స్టేషన్ కు, ఇంటికి కూడా వచ్చి లంచం ఆఫర్ చేశాడని.. ఓ ఎస్ఐ ఫిర్యాదు చేశారు. డబ్బు కవర్లు ఇస్తూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్తి వసంత కృష్ణప్రసాద్ కు అనుకూలంగా ఉండాలని.. వెంకటరామారావు పోలీసును కోరుతున్నారు.
వెంకటరామారావు సంప్రదించిన స్టేషన్ల ఎస్సై, సీఐలు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో.. ఉన్నతాధికారులు ఉన్న పళంగా కేసు నమోదు చేసి… సీసీ కెమెరా ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. కవర్లు తీసుకొచ్చిన వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు రామారావుపై ఐపీసీ 448, 109 సెక్షన్లతో పాటు ఎన్నికల నేరం కింద 171 సెక్షన్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. మైలవరం నియోజకవర్గంలోని మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లకు వెళ్లి డబ్బు కవర్లు ఇవ్వబోయారు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మైలవరం నియోజకవర్గం నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమను ఓడించడానికి… మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఆయన దీని కోసం చాలా పెద్ద బడ్జెటే పెట్టుకున్నారు. కొద్ది రోజుల కిందట..వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా… కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వసంతకృష్ణప్రసాద్ వర్గీయులు చీరలు పంచి పెట్టారు. ఇప్పటికే గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరుగుతోంది. టీడీపీకి పట్టున్న పలు గ్రామాల్లో పోటాపోటీకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ కోణంలో తాజాగా.. నేరుగా పోలీసులకే కవర్లు ఇచ్చేందుకు వచ్చి.. దొరికిపోయారు.
కొద్ది రోజుల కిందట… వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి… మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు.. ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించారు. కడప నుంచి మనుషుల్ని పిలించి.. హత్యలు చేస్తామన్నట్లుగా హెచ్చరించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఆయన తన ఉద్దేశం అది కాదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో.. దేవినేని ఉమను.. ఓడించడానికి తమ కుమారుడు ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతారని.. జగన్ కు.. దేవినేని ఉమపై చాలా కోపం ఉందని… ఆయనను ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు వ్యవహారాలు నడుస్తున్నాయి.