ఆమంచి కృష్ణమోహన్ – గత రెండు రోజులుగా ఈ పేరు మీడియాలో బాగా నలుగుతోంది. 2014 ఎన్నికల్లో ఇటు టిడిపి అభ్యర్థిని అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ని ఇద్దరినీ ఓడించి ఇండిపెండెంట్ గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ పేరు అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన సొంత బలంతో చీరాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టిడిపికి అనుబంధ సభ్యుడిగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఇంక దాదాపుగా వైఎస్ఆర్సిపి లో చేరడం ఖాయం అయిపోయిందనుకున్న సమయంలో, మళ్లీ సమీకరణాలు మారాయి.
ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో, చంద్రబాబుతో ఆమంచి కృష్ణమోహన్ చర్చలు జరిపారు. రవాణా శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ అయ్యారు. ఒకానొక సమయంలో ఈ చర్చలు ఫలించినట్టు, ఆమంచి టిడిపిలోనే కొనసాగనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆమంచి కృష్ణమోహన్ రామచంద్రపురం వెళ్లి టిడిపి నేత తోట త్రిమూర్తులు తో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. తోట త్రిమూర్తులు కూడా ఆఖరి నిముషంలో తెలుగుదేశం పార్టీ కి హ్యాండ్ ఇచ్చి జనసేన లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ఒక పత్రిక లో కథనాలు వచ్చాయి. దాంతో త్రిమూర్తులతో కృష్ణమోహన్ భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. అది కాకుండా మిగతా అన్ని మీడియాలలో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు కథనాలు వస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి ఛానల్ లో ఆమంచి గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.
కచ్చితంగా గెలిచే అభ్యర్థిగా పేరున్న ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరనున్నారనే ది ఆసక్తికరంగా మారింది. కృష్ణమోహన్ భవిష్యత్తు నిర్ణయం ఏమిటి అనేది బహుశా రెండు మూడు రోజుల్లో తేలిపోవచ్చు.