రాష్ట్రానికో ప్రచారాస్త్రాన్ని సంధించే ప్రయత్నం చేస్తున్నారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. ఆంధ్రాకి వచ్చి అభివృద్ధి చేశామన్నారు! ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి వెళ్లి రామాయాలం నిర్మాణం చేస్తామని మాట్లాడుతున్నారు. కొద్దిరోజుల కిందటే… పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… మమతా పాలనపై భాజపా పోరాడుతుంది అన్నారు. ఈ తీరు గమనిస్తే… ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా భాజపా చేసుకుంటోందని అర్థమౌతుంది.
రామ జన్మభూమి అంశంతో రాజకీయంగా భాజపా గతంలో ఎలాంటి మైలేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశాన్ని మరోసారి యూపీలో ప్రచారం మొదలుపెట్టారు అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బూత్ స్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. భాజపా ఆధ్వర్యంలోనే అద్భుతమైన రామాలయాన్ని నిర్మాణం చేపడతామన్నారు. మందిరం నిర్మాణం కోసం అదే స్థలాన్ని బీజేపీ కోరిందన్నారు. ఆలయ నిర్మాణంపై మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ సమాజ్ వాదీ, బీఎస్పీలకు సవాల్ చేశారు అమిత్ షా. అంతేకాదు, రామాలయాన్ని కట్టాలా వద్దా అనేది ఈ రెండు పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ ఖ్యాతిని ప్రధాని మోడీ విశ్వవ్యాప్తం చేశారని మెచ్చుకున్నారు. మనదేశ సైనికుల మరణానికి ప్రతీకారంగా పాకిస్థాన్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారన్నారు. యూపీలో 74 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. మరోసారి అధికారంలోకి రాగానే చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన ప్రధాని మోడీ, అమిత్ షాలు వరుసగా నిర్వహిస్తున్న సభల్ని జాగ్రత్తగా గమనిస్తే… గడచిన ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడటం లేదు. పైగా, అన్ని రాష్ట్రాలకూ ఒకే ప్రచారం పనికిరాదని వారే అర్థం చేసుకున్నట్టున్నారు. అంటే, అన్ని రాష్ట్రాలపై కేంద్రంలోని మోడీ సర్కారు ఒకే విధమైన వైఖరి అవలంభించలేదని వారే చెప్తున్నట్టుగా ఉంది. చివరికి, భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి గురించి మాట్లాడకుండా… రామాలయం గురించి మాట్లాడుతున్నారంటేనే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు కలిసి బరిలోకి దిగితే ఏం జరుగుతుందో కొన్ని నెలల కిందట జరిగిన రెండు ఎంపీ స్థానాల ఉప ఎన్నికలు స్పష్టం చేశాయి. దాంతో లోక్ సభ ఎన్నికల్లో మరోసారి రామాలయం అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా… ఆ రెండు పార్టీలనూ సందిగ్ధంలో పడేయాలన్నదే అమిత్ షా వ్యూహం. అయితే, ఈ ఎన్నికల్లో రామాలయ నిర్మాణం ప్రధానాంశమా, మోడీ పాలన ప్రధానాంశమా అనేది ప్రజలకు స్పష్టత ఉంటుంది కదా.