దర్శకుడు మారుతి ఈరోజుల్లో, బస్ట్ స్టాప్ సినిమాలు తీసిన తరువాత ఆ టైపు సినిమాలు లెక్క లేకుండా పుట్టుకువచ్చాయి. ఆ సినిమాల సక్సెస్ సూత్రాన్ని వదిలేసి, కేవలం అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ల క్రేజీ వ్యవహారాలు మాత్రం పట్టుకుని, ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీసారు. ఏ గోడ మీద చూసినా అదే టైపు పోస్టర్లు కనిపించేవి. పావలాకి, పదికి సినిమా తీసేయడం, వదిలేయడం. ఆ అంకానికి మళ్లీ మారుతినే ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రేమ కథాచిత్రమ్ తో హర్రర్ కామెడీకి తెరతీసారు. దాంతో మళ్లీ అదే పోక. అవే సినిమాలు.
సరే, ఇవన్నీ అయిపోయాయి, సినిమాలు మళ్లీ గాడిన పడ్డాయి అనుకుంటే ఆర్ఎక్స్ 100 వచ్చింది. దాంతో రఫ్ లవ్ స్టోరీలు మొదలయ్యాయి. అవి ఓ పక్క తయారవుతుంటేనే, అడల్ట్ కామెడీ పేరు చెప్పుకుని, బూతు సినిమాలు బయల్దేరాయి. చీకటి కొట్లో చితక్కొట్టుడు, 4 లెటర్స్ అంటూ ఇప్పటికి రెండు సినిమా కంటెంట్ కాస్త బయటకు వచ్చింది. పక్కా పాలిష్డ్ బూతుపదాలు, మోటు బూతు సీన్లు వీటిలో వున్నట్లు క్లియర్ గా తెలిసిపోతొంది.
వీటిల్లో చీకటి గదిలో చితకొట్టుడు సినిమా తమిళంలో చిన్న సినిమాగా విడుదలై భయంకరంగా వసూళ్లు సాగించింది. ఇప్పుడు దానినే మళ్లీ తెలుగులో అదే దర్శకుడు-నిర్మాత రీమేక్ చేసారు. ఈ రెండు సినిమాలు కనుక కాస్త ఆడాయి అంటే, ఇక చూస్కోండి నా రాజా అన్నట్లు వరుసపెట్టి ఇలాంటి సినిమా ప్రేక్షకుల మీదకు దాడి చేయడం ఖాయం. చిన్న సినిమాలు తీసి, విజయం సాధించాలనే ఔత్సాహికులకు ఇలాంటి ఓ ఫార్ములా దొరకడం ఆలస్యం కదా?