ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు రేపు పదవీ విమరణ చేయబోతున్నారు. రేపు ఆదివారం కనుక ఒకరోజు ముందుగానే సత్య ప్రసాద్ టక్కర్ ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఆయన రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1981 బ్యాచ్ కి చెందిన సత్య ప్రకాష్ టక్కర్ 2004-2010 వరకు సుదీర్గ కాలం పాటు సమైక్య రాష్ట్ర సాగునీటి శాఖకి ప్రధాన కార్యదర్శిగా చేసారు. అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి వాటిని అంతే పకడ్బందీగా అమలు చేయడంలో సమర్ధుడని ఆయనకు మంచి పేరుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014లో అధికారం చేపట్టిన తరువాత ప్రకటించిన ఏడు మిషన్లు-ఐదు అభివృద్ధి గ్రిడ్స్ ప్రణాళికను ఆయనే రూపొందించినట్లు సమాచారం.
సత్య ప్రకాష్ టక్కర్ బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలోగా అమరావతి మొదటిదశ నిర్మాణం పూర్తి చేయడం, ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ల సహాయసహకారాలతో సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి అన్నివిధాల సహకరిస్తానని తెలిపారు. రేపు పదవీ విరమణ చేయబోతున్న ఐ.వై.ఆర్.కృష్ణారావు రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ కి చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు.