ఆయనొస్తే ఆస్తులకు రక్షణ ఉండదు..!
ఆయనొస్తే మళ్లీ కబ్జా ముఠాలు చెలరేగిపోతాయి..!
ఆయనొస్తే మంగళి కృష్ణ లాంటి వాళ్లే పోలీసులయిపోతారు..!
ఆయనొస్తే ఇక ఎవరికీ కంటి మీద కునుకు ఉండదు..!
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సామాన్యుల్లో ఉన్న ఇమేజ్ ఇదే. వైఎస్ హయాంలో .. అనంతపురంలో పరిటాల రవి హత్య దగ్గర్నుంచి హైదరాబాద్ లో భూకబ్దాల సెటిల్మెంట్ల వరకూ.. ఎన్నింటిలో.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రజలందరూ చూశారు కాబట్టే… ఈ అభిప్రాయం ఏర్పడింది. ఇది నిజం కాదని.. అంతా మీడియా సృష్టేనని జగన్ వాదించుకోవచ్చు కానీ… ఆ వాదనతో ప్రజల అభిప్రాయాలు మారవు. తన ప్రవర్తనతోనే మారతాయి. ఆ ఇమేజ్ను.. జగన్ తగ్గించుకుంటున్నారా..? పెంచుకుంటున్నారా..?
ఆ ఇమేజ్ పెంచుకోవడం ఎందుకు..?
ముఖ్యమంత్రిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చినా తప్పులేదు..!.. ఈ మాట ఓ ప్రతిపక్ష నేత నోటి నుంచి వచ్చినప్పుడు.. రాష్ట్రం రేగిన గగ్గోలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. చేశారంటూ.. అనేక వ్యవహారాలు ప్రజల్లో రకరకాల రూమర్లుగా ప్రచారంలో ఉన్నాయి. అచ్చంగా అలాంటి వాటిని గుర్తుకు తెచ్చేలా.. ఈ మాటలు ఉన్నాయి. ఈ ఒక్క మాటతోనే… ప్రజల్లో భయం ఏర్పడిపోయిందనే అభిప్రాయం ఉంది. ఆ ఫీడ్ బ్యాక్… జగన్ దాకా వెళ్లిందో లేదో కానీ.. ఆయన మాత్రం అలాంటి మాటలు తగ్గించలేదు. తర్వాత బావిలో దూకి.. చావమని హెచ్చరించే వరకూ.. వెళ్లింది. తాజాగా.. చంద్రబాబును దున్న అనాలంటూ… తన సభలోనే … ప్రకటించి…. మరింత కలకలం రేపారు. ఆయనొస్తే.. ఏమవుతుందని ప్రజలు అనుకుంటారో… అదే జరుగుతుందన్నట్లుగా.. ఆయన వ్యవహారశైలి ఉంది. ఇటీవలి కాలంలో… ఓ సామాజికవర్గం కేంద్రం లక్ష్యంగా సాగుతున్న ప్రచారంతో.. ఆయనొస్తే.. మా మీద దాడులు జరిగుతాయేమోనన్న ఆందోళనతో ఆ కుల సంఘాలు ప్రెస్నోట్లు విడుదల చేసుకోవాల్సిన దుస్థితి వచ్చేసింది.
హత్యలు, పొడవడాలు, ఖూనీల లాంగ్వేజ్ ను వదిలి పెట్టరా..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. భాషా శైలిని చూస్తే.. కచ్చితంగా ఆయన ఓ విషయం చెప్పాలంటే.. ఓ నేరంతోనే పోలుస్తారు. ఉదాహరణకు చంద్రబాబు… నల్ల చొక్కాలతో.. కేంద్రం తీరుపై నిరసన చేసి.. ఓ దీక్ష చేశారనుకుందాం..! అప్పుడు ఆయన స్పందన ఏమిటి..” చంద్రబాబే.. ప్రత్యేకహోదాను.. కత్తితో పోడిచి.. చంపేసి.. ఇప్పుడు సంతాప సభలు పెట్టారు..” అంటూ స్పందిస్తారు. చాలా సార్లు స్పందించారు కూడా. ఇదొక్కటే కాదు… ఆయన నోటి నుంచి చాలా అసువుగా.. చంపడం.. నరకడం…లాంటి పదాలు వచ్చేస్తాయి. ప్రజల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ బలపడటానికి ఇదీ ఓ కారణం. ఆయనపై అనేక రకాల ప్రచారాలు ఉండొచ్చు కానీ.. అదంతా నిజమేనన్నట్లుగా.. ఆయన లాంగ్వేజ్, వ్యవహారం మొత్తం వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటే ప్రజల్లో భయం పుట్టదా..?
రాజకీయాలు అంటే వ్యక్తిగత శత్రుత్వం కాదు..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజకీయాలు అంటే.. ఏమనుకుంటారో కానీ.. ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎవరైనా రాజకీయాల్లో ఉంటారు. అంత మాత్రం దానికి తనకు పోటీగా ఉన్న నేతల్ని.. నాయకుల్ని.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కాదు. ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయం. ప్రజల కోసం.. ఎన్ని విమర్శలైనా చేయవచ్చు కానీ.. కొడతా.. పొడుస్తా… చావు.. చంపుతా.. అంటే… అది రాజకీయం కాదు. ఈ విషయం అంచనా వేసుకుని జగన్ తన ఇమేజ్ను మార్చుకునే ప్రయత్నం చేయకపోతే.. ఈయనకు ఓటేసి… లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకున్న భావన సామాన్య ప్రజలకు రావడం ఖాయం కావొచ్చు.