వృద్ధాప్య పింఛెన్ ను ప్రభుత్వం రూ. 2 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాము అధికారంలోకి రాగానే రూ. 3 వేలు చేస్తామంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తాజాగా హామీ ఇస్తున్నారు. పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తామని మనం ప్రకటిస్తే, ఖాకీ చొక్కా వేసుకున్న సీఎం చంద్రబాబు మనం ఇచ్చిన మాటను కాపీ కొట్టి అమలు చేశారన్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళలకు మనం రూ. 75 వేలు ఇస్తామని చెప్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు కొత్తగా కార్పొరేషన్లు ప్రకటించారన్నారు. మన నవరత్నాలన్నింటినీ ముఖ్యమంత్రి కాపీ కొడుతున్నారంటూ తిరుపతిలో జరిగిన సభలో జగన్ తీవ్రంగా ఆరోపించారు.
మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తామనీ, ఇప్పటికన్నా ఎక్కువగానే చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. ప్రతీ యాభై కుటుంబాలకూ ఒక వలంటీర్ ని పెట్టి, ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామన్నారు. పరిశ్రమల్లో మన పిల్లలకే 75 శాతం ఉద్యోగాలు దక్కేట్టు చట్టం తీసుకొస్తామన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు రీఎంబర్స్ మెంట్ నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు. ఇలా వరుసగా జగన్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు సమస్య అంతా కొత్త హామీలతోనే! టీడీపీ రూ. 2 వేలు పెన్షన్ ఇస్తే, మనం 3 వేలు ఇస్తామంటున్నారు, సంక్షేమ పథకాలు ఇప్పటికంటే ఎక్కువగా అమలు చేస్తామంటున్నారు. అయితే, ఈ హామీలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు..? సవరిస్తున్న జగన్ హామీలకు ఆదరణ ఉంటుందా అనేదే పెద్ద ప్రశ్న?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తీసుకుంటే… రూ. 2 లక్షల రుణమాఫీ అనీ, నిరుద్యోగ భృతి రూ. 3 వేలు చేస్తామనీ, రూ. 8 వేలున్న రైతు బంధుని రూ. 10 వేలు చేస్తామనీ ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఇస్తామని కాంగ్రెస్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ హామీలను ప్రజలు పట్టించుకోలేదు. అంటే అర్థమేంటి.. అధికారంలో ఉన్నవారు అడక్కుండానే తమ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఉంటే, ఇంకెవరో వచ్చి ఇంకేదో చేస్తారంటే నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉండదనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపణ అయింది. ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలకంటే.. ఇంకాస్త ఎక్కువ చేస్తామంటూ జగన్ చెప్పడాన్ని కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం దాదాపు అలానే ఉంటుంది. ఎన్నికలకు సమీపిస్తున్న ఈ సమయంలో ఈ కొత్త హామీలను ప్రజల్లోకి ఎంత ప్రభావంతంగా తీసుకెళ్లగలరు అనేదే జగన్ ముందున్న సవాల్.