చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో ఉండాలా వద్దా..అనేది రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో తనకు కలుగుతున్న ఇబ్బందులు, వాటిని కలిగిస్తున్న వారి పేర్లను.. చంద్రబాబుకు చెప్పాని.. అన్నింటినీ సీఎం పరిష్కరిస్తానన్నారని.. ఆమంచి భేటీ తర్వాత మీడియాకు చెప్పారు. పార్టీకి అతీతంగా ఏదో శక్తి ఇబ్బందికి గురిచేసిందన్నారు. భవిష్యత్లో ఇబ్బందులు ఉండవని చెప్పారు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అయితే పార్టీలోనే ఉంటానన్న విషయాన్ని మాత్రం ఆమంచి చెప్పలేదు. నియోజకవర్గానికి వెళ్లి అనుచరులతో మాట్లాడతానని ..రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానన్నారు. తాను కాంట్రాక్టులు అడగలేదు, తీసుకోలేదని ఆమంచి స్పష్టం చేశారు. ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదన్నారు.
పార్టీలో ఉంటానా లేనా అనేది సమస్య కాదు కానీ.. సీఎం చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నానని ప్రకటించారు. టీడీపీలో ఉంటానని కచ్చితంగా చెప్పని ఆమంచి … టీడీపీ ఇప్పుడు మంచి ఊపు మీద ఉందని ప్రకటించారు. పెన్షన్లు, పసుపు కుంకుమ జనంలోకి వెళ్లాయన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా పెద్దదన్నారు. పార్టీకి మంచి ఊపు ఉన్న సమయంలోనే తాను పార్టీలో ఇమడలేకపోతున్నానన్నారు. పార్టీకి ఇబ్బంది కలగకూడదనేది తన ఉద్దేశమన్నారు. గత ఎన్నికల్లో.. నవోదయం అనే పార్టీ పెట్టుకుని ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఆమంచి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. కానీ.. తెలుగుదేశంలో… చీరాల తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి పోతుల సునీతకు ఎమ్మెల్సీతో పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవి ఇచ్చారు. దాంతో.. ఆమంచికి వ్యతిరేకంగా పోతుల సునీత రాజకీయం చేస్తున్నారు.
అదే సమయంలో.. జిల్లాలోని ముఖ్యమైన టీడీపీ నేతలతో కూడా.. ఆమంచికి సరి పడటం లేదు. దీంతో పార్టీలో ఇమడలేననే పరిస్థితికి వచ్చారు. అనుచరులతో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిర్ణయం ప్రకటించే ముందు చంద్రబాబు కబురు చేయడంతో ఆయనను కలిశారు. చంద్రబాబు చెప్పిన విషయాలను..మరోసారి అనుచరులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు. కానీ ఆయన మాటలను బట్టి చూస్తే టీడీపీలో ఉండే అవకాశం లేదని ఆయన అనుచరులు అంటున్నారు.