టాలీవుడ్లో ఎవరి నోట విన్నా బోయపాటి, దాయన్యల గురించే. వినయ విధేయ రామ ఫ్లాపు ఈ దర్శకుడు, నిర్మాత మధ్య చిచ్చు రేపింది. ఎవరి వెర్షన్ వాళ్లది. ఎవరి వాదన వాళ్లది. నిజానికి ఈ ఇష్యూలో ఇప్పటి వరకూ ఏం జరిగింది? ఎవరి వాదనేంటి? ఎవరిపై ఎవరు నోరు పారేసుకున్నారు..?
సంక్రాంతికి విడుదలైన ‘వినయ విధేయ రామ’కి భారీ నష్టాలొచ్చాయి. వాటి విలువ దాదాపు 30 కోట్లు. అందుకే… పంపిణీదారుల నష్టాల్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో దానయ్య ముందుకొచ్చారు. నష్టాల్ని తానొక్కడే భరించలేడు కదా? అందుకే హీరోనీ, దర్శకుడ్నీ వాటా అడిగారు.
ఈ సీన్లోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంట్రీ ఇచ్చారు. బోయపాటి శ్రీనుని పిలిపించి మాట్లాడారు. శ్రీను కూడా ‘నష్టాలొచ్చిన మాట నిజమే. అందులో కొంత భర్తీ చేయడానికి నేను సిద్ధమే’ అని చెప్పేశాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంత గొడవ వచ్చేది కాదు.
కానీ కొన్ని రోజుల క్రితం బోయపాటి ఆఫీసులో మరోసారి సిట్టింగ్ జరిగింది. దానయ్య వస్తూ వస్తూనే.. బోయపాటిపై వీర లెవిల్లో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. ముందుగా టంగ్ స్లిప్పయ్యింది దానయ్యే అని సమాచారం. తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుల్ని వదిలేది లేదని, వాళ్ల నుంచి నష్టపరిహారం చాలాసార్లు రాబట్టుకున్నానని ఉదంతాలతో సహా వివరించడట దానయ్య. అంటే అర్థం ఏమిటి? ‘ఈ సినిమాతో నష్టాలొచ్చాయి.. నిన్ను కూడా వదలను..’ అని బోయపాటిని పరోక్షంగా హెచ్చరించినట్టు.
బోయపాటి కూడా తగిన విధంగానే స్పందించాడట. ”నష్టపరిహారం ఇవ్వడానికి నేను సిద్ధమే. కాకపోతే.. ఈ సినిమాకి అయిన బడ్జెట్ లెక్కలు నాకు కావాలి.. ఏ ఏరియాలో ఎంతకు అమ్ముకున్నారో నాకు తెలియాలి” అంటూ లాజిక్కులు తీశాడట. ‘లెక్కల’ విషయం ఎత్తేసరికి దానయ్య మరింత విజృంభించాడని తెలుస్తోంది. ”సినిమాని ఎక్కువ రేట్లకు అమ్ముకుని లాభపడింది మీరు.. అలాంటప్పుడు నేనెందుకు పారితోషికం తిరిగి ఇవ్వాలి” అన్నది బోయపాటి పాయింట్. లాభాలు మొత్తం తిరిగి ఇస్తే… అసలు ఎవరూ పారితోషికాన్ని ఇవ్వనవసరం లేదని బోయపాటి వాదిస్తున్నాడట. బోయపాటి దగ్గరున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి రూ.90 కోట్ల బడ్జెట్ అయ్యింది. దాదాపు 120 కోట్లకు అమ్ముకున్నారు. అంటే… నిర్మాతకు 30 కోట్ల లాభం వచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలన్నది బోయపాటి డిమాండ్‌గా కనిపిస్తోంది.
ఈ గొడవలో మధ్యవర్తిగా తలదూర్చిన దిల్ రాజు కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నాడట. ప్రస్తుతానికైతే బోయపాటి – దానయ్య మధ్య గొడవ సద్దుమణిగేలా లేదు. పారితోషికం తిరిగి ఇవ్వమని దానయ్య, లెక్కలు చూపించమని బోయపాటి వాదించుకుంటున్నారు. ఆ లెక్కలు తేలితే గానీ.. నష్టపరిహారం విషయంలో స్పష్టత వచ్చేట్టు కనిపించడం లేదు.