ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ సంస్థ బారినపడి ఎంతో మంది బాధపడుతున్న సంగతి తెలిసిందే. లక్షమంది డిపాజిట్ దారులు సొమ్ము అగ్రిగోల్డ్ కేసులో చిక్కుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో తాము దాచుకున్న సొమ్ము తిరిగి వస్తుందా లేదా అనే ఆందోళన చాలామందిలో ఉంది. అయితే, 3.5 లక్షమంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం రూ. 250 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంతో మూడున్నర లక్షల మందికి ఊరట లభించనుంది. పదివేల లోపు డిపాజిట్లు అంటే, దాదాపు అందరూ పేదవారే ఉంటారు. ముందుగా వారికి ఊరట కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజకీయంగా కూడా నిర్ణయం సంచలనమే కానుంది. ఎందుకంటే, తాను ముఖ్యమంత్రి అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఇది వైకాపా శిబిరంలో మరోసారి కలకలం ఖాయంగానే కనిపిస్తోంది. గతవారంలోనే జగన్ ఓ కార్యక్రమంలో మట్లాడుతూ… పెన్షన్లు పెంచారు, కులాల వారీగా కొర్పొరేషన్ వేశారు, పసుపు కుంకుమ ఇస్తున్నారు కానీ అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై విమర్శలు చేస్తూ… అగ్రిగోల్ బాధితులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ వైకాపా నేతలు ప్రశ్నించారు. వీరి కోసం ప్రభుత్వం ఏమీ చెయ్యలేదనీ, జగన్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారంటూ వైకాపా నేత బొత్స కూడా గతవారమే ఓ ప్రెస్ మీట్లో విమర్శించారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వైకాపా ప్రచార అమ్ముల పొదిలోంచి మరో అస్త్రం జారిపడిపోయినట్టే. ఇది కూడా జగన్ హామీ కాపీ అంటూ వైకాపా నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టడమే ఇక తరువాయి! తాజా ప్రభుత్వ నిర్ణయంతో మూడున్నర లక్షల మందికి జరుగుతున్న మేలును వైకాపా గుర్తించదు. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంలో కూడా వైకాపా విజయాన్ని వెతుక్కునే ప్రయత్నమే జరుగుతుందనడంలో సందేహం లేదు.