సమర శంఖారావం పేరుతో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వరుసగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాన్లో భాగంగా కడపలో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై యథావిధిగా విమర్శలు గుప్పించారు. జగన్ విమర్శల్లో ఎక్కువగా కనిపించింది ఏంటంటే… టీడీపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అక్కసు వెళ్లగక్కడమే! చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నవి నమ్మొద్దు నమ్మొద్దు అంటూ పదేపదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెబుతున్నవన్నీ అబద్ధాలనీ, తాను మాత్రమే నిజాలు చెబుతున్నానని వివరించేందుకు ప్రయత్నించారు. అంటే, పాలన అబద్ధం… హామీలే నిజమని నమ్మమని చెబుతున్నారు.
ఓటర్ల జాబితాలో తమ పార్టీవారి పేర్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బు కోసం మోసపోవద్దనీ, అన్న వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, రాగానే ప్రతీ సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తారని ప్రతీ అమ్మకీ చెల్లికీ చెప్పాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చే ఈ సొమ్ము చూసి మోసపోవద్దనీ… అన్న ముఖ్యమంత్రి కాగానే మే నెల వచ్చేసరికి ప్రతీ రైతన్న చేతిలో రూ. 12,500 పెట్టబోతున్నాడని చెప్పమని కోరారు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న సొమ్ము నమ్మొద్దనీ, అన్న ముఖ్యమంత్రి కాగానే 45 ఏళ్లు నిండిన ప్రతీ అక్కకూ ఇంటికొచ్చి రూ. 75 వేలు ఇస్తానని చెప్పాలన్నారు! ‘అమ్మా… చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు(?) నమ్మొద్దమ్మా. అన్న వస్తున్నాడూ ముఖ్యమంత్రి అవుతున్నాడు, రాగానే పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాడు’ అని చెప్పమన్నారు.
‘అన్న ముఖ్యమంత్రి అవుతాడు’, ‘డబ్బులు ఇస్తాడు’, ‘చంద్రబాబు ఇస్తున్న డబ్బులు నమ్మొద్దు’… ఈ మూడు అంశాలనే ప్రధానంగా చేసుకుని జగన్ ప్రసంగం సాగింది. జాగ్రత్తగా గమనిస్తే… ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో జగన్ కి కేవలం డబ్బు మాత్రమే కనిపిస్తోంది, దాన్ని దాటి సంక్షేమాన్ని ఆయన చూడలేకపోతున్నారు. అంతేకాదు… ప్రస్తుతం జగన్ ఇస్తున్న హామీల్లో కూడా కేవలం డబ్బు అంశాన్నే హైలైట్ చేస్తున్నారు, అంతేగానీ సంక్షేమం ఊసెత్తడం లేదు! టీడీపీ ఇస్తున్నదాని కంటే ఎక్కువ ఇస్తామని ప్రచారం చేసుకోవడం చూస్తుంటే… బేరమాడుతున్నట్టుగానే ఉంది. ఇంకోటి… ‘అన్న ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడు’ అంటూ చాలాసార్లు ఆయనే చెప్పుకుంటున్న పరిస్థితిని ప్రత్యేకంగా గమనించాలి. జగన్ లో పదవీ వ్యామోహం ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ఎంత తీవ్రతరం అవుతోందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ పథకాలు అంటే డబ్బు పంచడమే అనుకునే నాయకుడు ముఖ్యమంత్రి అయితే… ఆ పాలనలో మానవీయ కోణం ఉంటుందా ఉండదా అని ఆలోచించే శక్తి ప్రజలకు ఉందని వారు అనుకుంటున్నట్టుగా లేదు.