బాహుబలికి ముందు మిర్చి, బాహుబలి తర్వాత సాహో… ఈ సినిమాలన్నీ యాక్షన్ కథలే. ప్రభాస్ 20 మాత్రం ప్రేమకథ. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్. ప్రతి ప్రేమకథలోనూ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, అలకలు, ప్రేమకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు లేదా సందర్భాలు సహజమే. అయితే.. ఆ ప్రేమకథల్లో నటించడం అంత సులభం కాదని పూజ హెగ్డే అన్నారు. “ప్రభాస్ 20… అమేజింగ్ స్క్రిప్ట్. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో చాలెంజింగ్ స్క్రిప్ట్ ఈ సినిమాదే. కథ విన్నాక నా మతి పోయింది. అంత అద్భుతంగా ఉంటుంది. నా పాత్ర విషయానికి వస్తే… అటువంటి పాత్రలో నటించడం చాలా కష్టం. చాలా చాలెంజింగ్ రోల్. సినిమా కోసం మేమంతా ఎంతగానో కష్టపడుతున్నాం. ఓ అందమైన సినిమా ఇది. యూనిక్ గా ఉంటుందని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తునన్నా” అని పూజ హెగ్డే అన్నారు.