నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలి సమావేశాలకు చివరి రోజు కావడంతో.. టీడీపీ సభ్యులంతా.. మళ్లీ మేమే వస్తామంటూ.. నినాదాలు చేసి.. చప్పట్లు కొట్టి.. వచ్చే అసెంబ్లీలో.. కొత్త సభలో .. కొత్త ప్రభుత్వంలో కలుద్దామంటూ… పరస్పరం అభినందులు తెలుపుకున్నారు. “మళ్లీ వచ్చేది మీరు కాదు మేమంటూ”… చెప్పుకోవడానికి వైసీపీ సభ్యులెవరూ అసెంబ్లీలో లేరు. దీంతో షో అంతా.. తెలుగుశం పార్టీ సభ్యులదే అయింది. నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ సమావేశాలు.. చరిత్రలో నిలిచిపోతాయి. కేవలం ఎమ్మెల్యేలు ఫిరాయించారన్న కారణం చూపి.. ప్రధాన ప్రతిపక్షంగా.. అసెంబ్లీని పూర్తిగా బాయ్ కాట్ చేసింది. భారత ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలు అత్యున్నతమైనవి. అంశాల వారీగా… రాజకీయ పార్టీలు బాయ్ కాట్ చేస్తాయి కానీ.. రాజకీయ కారణాలతో పూర్తిగా బాయ్ కాట్ చేసిన సందర్భాలు లేవు.
అలా చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించినట్లయింది. నవ్యాంధ్ర తొలి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ తరపున గెలిచిన వాళ్లు.. ప్రతిపక్ష నేత కూడా..సరైన అనుభవం లేకపోవడంత.. ప్రతిపక్ష నేతకు.. సీనియర్ల సలహాలు వినే అలవాటు లేకపోవడంతో.. మొదట్లో.. ఆ పార్టీ .. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ.. అధికార పక్షం వ్యూహాలకు.. ఎప్పటికప్పుడు చేతులెత్తేయాల్సి వచ్చింది. బయట రాజకీయ వేదికల మీద చేసినట్లు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. వాటిని నిరూపించాలని అధికారపక్షం సవాల్ చేస్తే… స్పందించలేకపోయారు. చివరికి ఆ పార్టీ సభ్యురాలు.. రోజా.. అత్యంత దారుణమైన భాష ఉపయోగించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అలా మాట్లాడినట్లు.. రికార్డయినప్పటికీ.. తాను అలా మాట్లాడలేదని.. క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని భీష్మించుకు కూర్చున్నారు. పైగా… తన ఆడియోను మిమిక్రి చేశారని ప్రత్యారోపణలు చేశారు. ఇలా.. ప్రతిపక్షం వైసీపీ.. అసెంబ్లీలో సంప్రదాయాలు పాటించలేదు. గౌరవాన్ని ఇవ్వలేదు.
చివరికి బాయ్ కాట్ చేసి.. ప్రజాస్వామ్యానికే కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. అసెంబ్లీకి రాకపోయినప్పటికీ.. జీతాలు, అలవెన్స్ లు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుని విమర్శలు పాలయ్యారు. కానీ వారు మాత్రం తాము చేసిందే కరెక్టని వాదించుకుంటున్నారు. ఇక కొత్త అసెంబ్లీలో ప్రతిపక్షంలోనే వైసీపీ ఉండాల్సి వస్తే.. మళ్లీ అధికారంలోకి వచ్చే వరకూ అసెంబ్లీకి రాబోమని చెబుతారేమో..?