భారతీయ జనతా పార్టీ పై ఏపీలో ఇప్పుడు తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహం… విభజన హామీలు అమలు చేయకపోవడం అన్న కారణం వల్లే వచ్చింది. దీనికి సమాధానం చెబుతాం.. నిజాలు చెబుతాం.. సత్యమేవ జయతే అంటూ.. బీజేపీ నేతలు సభలు పెడుతున్నారు. మరి నిజంగా…వారు నిజాలు చెబుతారా..? ప్రజల ప్రశ్నలకు సమాధానాలిస్తారా..?
ఏమిచ్చారో నిజాయితీగా చెప్పండి..!
చాలా రోజులుగా.. లక్షల కోట్లు నిధులిచ్చాం.. ఐదు లక్షలు.. పది లక్షల కోట్లిచ్చాం.. అని నోటిమాటగా చెబుతున్నారు బీజేపీ నేతలు. కానీ వాటికి ఆధారాలిచ్చే కార్యక్రమాలేమీ పెట్టుకోలేదు. విద్యాసంస్థలు మంజూరు చేశామంటారు కానీ.. వాటికి ఇస్తున్న నిధులేమీలేవు. అవి పోను ప్రజల ప్రధానమైన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచుతున్నారు. ఇవేమీ.. వారు అడుగుతున్న డిమాండ్లు కావు.. చట్టంలో ఉన్నవే. ప్రత్యేకహోదా నుంచి రైల్వే జోన్ వరకు.. అనేక అంశాలపై … ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. 95 శాతం ఇచ్చాం అని చెప్పుకునే వారు.. ప్రత్యేకహోదా నుంచి స్టీల్ ఫ్యాక్టరీ వరకు… అనేక అంశాలను.. తీసుకొచ్చి.. ఇదిగో ఇచ్చామని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నా… వాటిని చేయడం లేదు.
ఇవ్వనివి ఎందుకివ్వలేదో చెప్పండి..!
ఏపీకి వచ్చిన సందర్భంలో… విభజన హామీలు.. ఎంత మేర అమలు చేశారో.. పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా మోడీకి ఉంది. రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్ట్, స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా .. ఇలా హామీలన్నీ ఎందుకు చేయడం లేదు.. ఇవ్వడం లేదన్నది సూటిగా చెప్పాలి. విభజన హామీల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి.. హమీ ఇచ్చిన మేరకు.. సహాయం అందడం లేదన్నది నిజం. ఢిల్లీని మించిన రాజధాని కడతామని.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి.. మోదీ ప్రకటించారు. కానీ..రూ. పదిహేను వందల కోట్లే ఇచ్చారు. పైగా.. అమరావతి నిర్మాణం జరగడం లేదని ఓ వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు.. అమరావతిని తామే నిర్మించామని చెప్పుకుంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. బీజేపీ వాళ్లిచ్చినది కాదు. యూపీఏ హయంలో.. విభజన చట్టంలో పెట్టిన ప్రాజెక్ట్. దీనికి సరిగ్గా నిధులు విడుదల చేయడం లేదని కేంద్రం చెబుతోంది.
చరిత్ర పాఠాలు అస్సలు చెప్పొద్దు సార్..!
కియా లాంటి కార్ల కంపెనీలను తామే తెచ్చామని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఆ కంపెనీ తెచ్చే ముందు.. ఓ ఆరు నెలల ముందు ఎందుకు చెప్పలేదు..? నిజంగా… ప్రధాని దాన్ని ఏపీకి సిఫార్సు చేసి ఉంటే… ముందు నుంచి చెప్పుకుని ఉండేవారు కదా..? ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమయ్యే సమయంలో దాన్ని మోడీనే ఏపీకి తెచ్చారని చెప్పుకోవడం ఎందుకు..? ఫిబ్రవరి 11వ తేదీన చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ఈ సమయంలో.. మోడీ ఏపీకి వచ్చి.. ప్రజల ప్రధాన డిమాండ్లపై స్పందించాలి. అలా కాకుండా.. చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాడింది.. ఇప్పుడు కలిశారంటూ.. కబుర్లు చెబితే.. పడిపోవడానికి.. ఇక్కడ ఉత్తరాది జనం లేరు.. !