ఢిల్లీలో చంద్రబాబు చేయనున్న ధర్మపోరాట దీక్ష…. తెలుగుదేశం పార్టీ అధినేతగా చేయడం లేదు. అచ్చంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్నారు. న్యాయంగా.. చేయాల్సిన సాయాన్ని చేయకుండా.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా… కేంద్రం చేసిన మోసానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. అచ్చంగా ఇది ఫెడరల్ వ్యవస్థలో… రాష్ట్రాలపై.. కేంద్రం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. ఇది రాజకీయ కార్యక్రమం కానే కాదు. ఏపీకి రావాల్సిన వాటి కోసం.. కేంద్రంపై పోరాటం చేయడం మినహా.. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అవకాశమూ దొరకలేదు. చిట్ట చివరి ప్రయత్నంగా… ఢిల్లీలో పోరుబాట పట్టింది.
ప్రజలు..తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీకి రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని అధికారికంగా నిర్వహిచిన ప్రభుత్వం.. అందర్నీ భాగస్వాముల్ని చేస్తోంది. ఈ దీక్షలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నాయి. ఉద్యోగులను ఢిల్లీకి తరలించేందుకు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేను కోరింది.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ధర్మపోరాట దీక్షలను… టీడీపీ.. పార్టీ పరంగా నిర్వహించింది. కానీ.. ఢిల్లీ విషయంలో మాత్రం.. అధికారిక నిరసన చేపట్టాలని నిర్ణయించింది. ఏపీలో ఏం జరిగినా… అది రాజకీయ కార్యక్రమమే అవుతుంది కాబట్టి.. సొంతంగా ఖర్చులు పెట్టుకుంది. కానీ.. ఢిల్లీలో..ఈ నిరనకు ప్రభుత్వ అధికారిక నిరసన ముద్ర పడాలంటే.. కచ్చితంగా… ప్రభుత్వమే నిరసన నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలు ధర్నాలో పాల్గొంటున్నాయి. ఫెడరల్ స్ఫూర్తి మోదీ ఎలా దెబ్బతీశారో… ఢిల్లీ వేదికగా వివరించబోతున్నారు.