‘వినయ విధేయ రామ’… ఈ సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్. సంక్రాంతికి విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకోలేదేమో. ఎప్పుడైతే బోయపాటి – దానయ్య మధ్య విబేధాలు బయటపడ్డాయో, అప్పటి నుంచీ ఈ పేరు తెగ నానుతోంది. ఈ సినిమాకొచ్చిన నష్టాలేంటి? దాన్ని హీరో, దర్శకుడు ఎలా భర్తీ చేద్దామనుకుంటున్నారు? అనేదే హాట్ టాపిక్.
చరణ్ తన పారితోషికంలోంచి 5 కోట్లు వెనక్కి ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కాకపోతే… చరణ్ మరోలా కూడా నిర్మాత భారాన్ని తగ్గించడానికి ఫిక్సయ్యాడు. చిరంజీవి – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది కదా? దీనికి దానయ్యే నిర్మాత. `వినయ విధేయ రామ` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ కాంబో గురించి తొలిసారి బయటపెట్టాడు చరణ్. `ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది చరణే` అని చిరు కూడా చెప్పేశాడు. చిరు రీ ఎంట్రీ తరవాత.. ఆ సినిమాలన్నీ కొణిదెల ప్రొడక్షన్లోనే తీయాలని నిర్ణయించుకున్నాడు చరణ్. సైరా కూడా తన సంస్థలోనే నిర్మిస్తున్నాడు. చిరుతో సినిమాలు చేయడానికి మిగిలిన నిర్మాతలంతా సిద్ధంగా ఉన్నా, అ అవకాశం ఎవ్వరికీ ఇవ్వదలచుకోలేదు చరణ్. కానీ… సడన్‌గా డీవీవీ దానయ్యని ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చాడు. ఇదంతా `వినయ విధేయ రామ` ఎఫెక్టే అని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చరణ్ ముందుగానే ఊహించాడని, అందుకు చిరు సినిమాని, దానయ్య చేతిలో పెట్టాడని, అలా పరోక్షంగా నిర్మాత భారాన్ని మోయడానికి ముందుకొచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చరణ్ తన వాటాగా రూ.5 కోట్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా… దానయ్యకు పెద్దగా తేడా కనిపించదన్నమాట. ఇక బోయపాటినే తన వాటా ఎంతో చెప్పాలి.