సికిందాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారంసాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ హామీల వెల్లువ కురిపించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో రాజధాని నగరానికి అందివ్వబోయే అనేక పథకాల గురించి వెల్లడించారు. ప్రసంగంలో భాగంగా.. చంద్రబాబునాయుడును ఉపేక్షించకుండా.. కేసీఆర్ విమర్శలు కురిపించడం విశేషం.
హైదరాబాదును నేను వదల వదల అంటున్నారు. ‘వదల బొమ్మాళీ వదల’ అంటున్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉండి చక్కిలిగింతలు పెడుతున్నారంటూ చతురోక్తులు విసిరారు. ఆయన హైదరాబాదును వదల అనేట్లయితే.. వదలద్దని చెప్పండి.. ఇక్కడే మరిన్ని హెరిటేజ్ దుకాణాలు పెట్టుకోమని చెప్పండి.. మీకేం కావాలో చెప్పండి.. లైసెన్సులు కావాలా.. మనీ కావాలా చెప్పండి… ఇస్తాం అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు ఇప్పుడు అసలు హైదరాబాదులోనే ఉండడం లేదని.. ఆయన అంతా బెజవాడలోనే ఉంటున్నారని.. నేను అమరావతి వెళ్లి.. ‘ఈ నగరాన్ని వదల’ అంటే కుదురుతుందా? బొంబాయికి వెళ్లి ‘వదల’ అంటే కుదురుతుందా? చంద్రబాబుకు కూడా హైదరాబాదు అంతే అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
నగరంలో ఉండని చంద్రబాబుకు తెలియదు గానీ.. ఆయన భార్య వదిన భువనేశ్వరి తమ పార్టీ కార్యకర్తలు వెళ్లి కలిసినప్పుడు.. నేను మీ పార్టీక ఓటు వేస్తా అని చెప్పిందంటూ కేసీఆర్ చెప్పారు. మా వదిన తెలివైనది అని కూడా కితాబిచ్చారు. అందుకే ఆమె కారుకు ఓటేస్తానంది అని అభివర్ణించారు.
అయితే.. కేసీఆర్ తన ప్రసంగం ఒరవడిలో భాగంగా.. చంద్రబాబుకు సంబంధంలేని మాటలను కూడా ఆయనకు ఆపాదించి విమర్శలు చేయడం గమనార్హం. హైదరాబాదులో ఉండి పాలించడం అంటే విదేశాల్లోనుంచి పాలించినట్లుగా ఉన్నదని చంద్రబాబు ఎన్నడూ అనని మాటలను, హైదరాబాదు వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలను కూడా చంద్రబాబుకే ఆపాదించి కేసీఆర్ విమర్శలు గుప్పించడం విశేషం.