గుంటూరు సభలో గంట సేపు .. నరేంద్రమోడీ ప్రసంగిస్తే.. అందులో దాదాపుగా 40 నిమిషాలు చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించిన నరేంద్రమోడీ.. ఏపీలో ఉన్న మరో రెండు పార్టీలు వైసీపీ, జనసేన గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రెండు పార్టీలు విభజన హామీల విషయంలో ఎలాంటి పోరాటం చేయడం లేదు కాబట్టి.. ఆయన లైట్ తీసుకున్నారని… తనకు వ్యతిరేకంగా నిరసనలు చేసింది.. ఒక్క టీడీపీ కాబట్టి.. టీడీపీనే టార్గెట్ చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వైసీపీ, జనసేన, బీజేపీ మధ్య లోపాయికారీ పొత్తులు ఉన్న విషయం… గుంటూరు సభతో తేలిపోయిందని… తెలుగుదేశం పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మోడీ పర్యటనపై వైసీపీ సానూకలం..!
నరేంద్రమోడీ ఏపీ పర్యటనకు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సానుకూలంగా వ్యవహరించింది. గుంటూరు నగరంలో కొంత మేర జన సమీకరణకు సమీకరించింది. ఏ ఒక్క నేత కూడా.. మోడీ టూర్‌పై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. వీలైనంతగా.. సహకరించే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. ఉదయం ట్విట్టర్లో ఎప్పుడో మూడు రోజుల కిందట విడుదలైన యాత్ర సినిమాకు శుభాకాంక్షలు చెప్పారు కానీ… మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారన్న అంశంపై స్పందించలేదు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ..అధినేత.. ఈ విషయంలో… బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా వ్యవహరించారు.
ఏపీ ప్రజల నిరసనల్ని చూపించని సాక్షి మీడియా..!
జగన్ మీడియా కూడా.. మోడీ వస్తున్నారనే ప్రచారం ప్రారంభమయినప్పటి నుంచి పూర్తిగా… మోడీ వ్యతిరేకత వార్తలను ఎవాయిడ్ చేసింది. ఏపీలో నిరసనలు వెల్లువెత్తినా చిన్న వార్త కూడా ఇవ్వలేదు. ఏపీలో అంతా బాగుందన్నట్లు కవర్ చేశారు. అదే సమయంలో.. మోడీ సభా ఏర్పాట్ల… ఆయన రాక.. బహిరంగసభ మొత్తానికి మంచి కవరేజీ ఇచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. వైసీపీ, ఆ పార్టీకి చెందిన మీడియా.. పూర్తి సహకారాన్ని బీజేపీకి అందించింది.
జనసేన రియాక్షనూ అంతే..!
జనసేన పార్టీపై కూడా నరేంద్రమోడీ మాట్లాడలేదు. గత ఎన్నికల సమయంలో ఎన్డీఏలో ఉన్న జనసేన.. ఆ తర్వాత ప్రత్యేకహోదా విషయంలో మోడీపై తీవ్ర విమర్శలు చేసింది. ఆ తర్వాత మళ్లీ సైలెంటయిపోయింది. మోడీ ఏపీకి వస్తున్న సందర్భంగా.. ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఓ రకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న టీడీపీని విమర్శించి… తాము బీజేపీ వైపే అన్నట్లుగా… ఓ సందేశాన్ని మాత్రం పంపించారు.