గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటూ ముమ్మరంగా పర్యటించి సభలు రోడ్‌షోలు నిర్వహించినప్పటికీ.. ఆయన ఎక్కడా కనీసం రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టిపోసే ధోరణిలో కూడా మాట్లాడలేదు… ఇక సవాళ్లకు పరాకాష్టలాగా తొడకొట్టడం అనేది ఎక్కడ జరిగిందబ్బా అని నివ్వెరపోతున్నారా? ఇది ఎన్నికల ప్రచారంలో తొడకొట్టడం కాదు. స్పోర్ట్స్ ఈవెంట్‌ను ప్రారంభిస్తూ.. ఆయన చూపించిన ఉత్సాహం మాత్రమే.
ఏపీలోని విశాఖపట్టణంలో శనివారం నాడు ప్రో కబడ్డీ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటిని ఘనంగా ప్రారంభించారు. పోటీలను ప్రారంభిస్తూ.. ప్రయోక్తల కోరిక మేరకు చంద్రబాబునాయుడు ఓసారి తన కుడి కాలు పైకెత్తి తొడకొట్టి.. సభికులకు ఆనందం కలిగించారు. కబడ్డీ జాతీయ క్రీడ అని.. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ప్రో కబడ్డీ పోటీలను ఏపీలోని విశాఖలో నిర్వహించడం గర్వకారణంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. ఆ రకంగా రాజకీయాల్లో ప్రచార బరిలో కాకపోయినప్పటికీ, కనీసం క్రీడా మైదానం చంద్రబాబు తొడకొట్టడం పలువురికి సరదాగా అనిపించింది.
నూటికి రెండు వందల శాతం తెలుగు టైటాన్స్ ఛాంపియన్స్ అవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలుగు టైటాన్స్ మరింత బాగా రాణిస్తారని.. చాంపియన్లుగా నిలుస్తారని చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. అలాగే.. అమరావతి నగరంలో ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ సిటీ ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. స్పోర్ట్ అభివృద్ధికి అమరావతి ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారో ఆ వివరాలను కూడా చంద్రబాబు హర్షధ్వానాల మధ్య వెల్లడించారు.