ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, దాన్ని సాధించి తీరాల్సిందే అని మొట్టమొదట నినదించింది కాంగ్రెస్ అన్నారు కేవీపీ రామచంద్రరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీలో చేసిన ప్రదర్శన ప్రజాధనంతో జరిగిందని విమర్శించారు! మూడేళ్ల కిందట కోటి సంతకాల ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. ఆ కార్యక్రమానికి అన్నీ తానై వ్యవహరించాననీ, అన్ని రకాల బాధ్యతలు తాను ఒంటి చేత్తో నిర్వహించానని కేవీపీ చెప్పారు. తన అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ్ల ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. అయితే, దీన్ని మనం శాంతియుతంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. రాహుల్ ని ప్రధాని చేసుకుని, నిరంకుశ మోడీకి బుద్ధి చెబుదామన్నారు.
కాంగ్రెస్ ఎడతెరపిలేకుండా చేస్తున్న పోరాటంలో చంద్రబాబు వచ్చి కలిశారన్నారు కేవీపీ. ఇన్నాళ్లకైనా ఆయనకి జ్ఞానోదయం అయినందుకు సంతోషిస్తున్నా అన్నారు. తను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ కి ఎన్నడూ లేనంతగా 14 జాతీయ పార్టీలను కూడగట్టారనీ, ఆ పార్టీల్లో ఇప్పుడు చంద్రబాబు కొత్తగా వచ్చి కలిసి హోదా కొత్తగా అడుగుతున్నారన్నారు. ‘రాహుల్ ప్రధాని కావడం కోసం మీ ఆలోచన ధోరణిని, రాజకీయ పంథాని మార్చుకున్నందుకు, మమ్మల్ని ఆ స్థితికి తీసుకు వచ్చినందుకు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చాలా ఆనందపడుతున్నా’ అని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకీ పార్టీకి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చెయ్యొద్దనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కీ హైకమాండ్ కి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు. తమను పార్టీ ద్రోహులుగా చిత్రంచే ప్రయత్నం చెయ్యొద్దన్నారు!
విచిత్రం ఏంటంటే… ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ పోరాడతామన్నవారే! కానీ, పోరాడింది ఎవరు అనేదే కదా అసలు ప్రశ్న..? ప్రతిపక్ష పార్టీ వైకాపా అయితే ప్రత్యేక హోదా ఉద్యమం ఉనికిని కాపాడింది మేమే అంటారు. ఎంపీలతో రాజీనామాలు చేయించాక కూడా ఏం సాధించారో చెప్పలేకపోయారు! ఇప్పుడు, అసలు హోదా నినాదమే తమని కేవీపీ అంటున్నారు. ఏపీ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు గడచిన నాలుగున్నరేళ్లపాటు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎందుకు ఈ ఊసెత్తలేదు? ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చి… మోడీ సర్కారుపై పోరాటం మొదలుపెట్టాకనే కదా కాంగ్రెస్ కూడా కలిసి వస్తానంటూ ముందుకొచ్చింది. ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామంటూ హామీ ఇచ్చారు. ఏపీ విషయంలో తమ ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని ఇప్పటికిప్పుడు సమర్థించుకునే ప్రయత్నం కేవీపీ చేస్తున్నా…నమ్మేందుకు ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు?