మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మార్చి 10న ఎన్నికలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అయితే ఈసారి అధ్యక్షపదవికి ద్విముఖ పోరు తప్పేటట్టు కనిపించడం లేదు. అధ్యక్ష పదవికి శివాజీరాజాతో పాటు నరేష్ కూడా పోటీ పడబోతున్నట్టు సమాచారం. నిజానికి శివాజీ రాజాని ఏకగ్రీవంగా ఎంచుకుంటే మంచిదని కొంతమంది పెద్దల అభిప్రాయం. ఈ రెండేళ్ల కాలంలో శివాజీ రాజా చేసిన కార్యక్రమాలు… ‘మా’ సభ్యుల మనసుల్ని గెలుచుకున్నాయి. అంతేకాదు… ‘మా’కి సంబంధించిన మూలధనం కూడా ఇదివరకటి కంటే పెరిగినట్టు తెలుస్తోంది. అందుకే శివాజీరాజానే మళ్లీ ‘మా’ అధ్యక్షుడిగా ఎంచుకోవాలని భావించారు.కానీ.. నరేష్ మాత్రం బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు. నరేష్‌ని ఒప్పించి, పోటీ నుంచి తప్పుకునేలా చేయాలని, ఈసారి ఎన్నికలు జరక్కుండానే అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎంచుకోవాలని కొంతమంది పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ నరేష్ పోటీలో నిలబడినా, పెద్దల సహాయ సహకారాలు మాత్రం శివాజీరాజానే మెండుగా ఉండేట్టు కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.