ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్సీపీ లోకి వెళ్ళిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని జన సేన పార్టీలోకి ఆహ్వానించ లేదని పేర్కొన్నారు. ఒక టీవీ చానల్ లో మాట్లాడిన ఆమంచి కృష్ణ మోహన్, జనసేనలో తాను ఎందుకు చేరలేదో వివరించారు .
2014 ఎన్నికల్లో ఇటు టిడిపి ఎమ్మెల్యే అటు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల ని ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణ మోహన్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించారు. అయితే 2019 ఎన్నికల కంటే ముందే తెలుగుదేశం పార్టీని ఆయన వీడతారన్న ప్రచారం కూడా ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా ఏ నాయకుల మీద అయితే తాను ఎన్నికల్లో గెలిచాడో, అదే నాయకులకు తెలుగుదేశం పార్టీలో పెద్దపీట వేయడం తనకు నచ్చలేదని, ప్రత్యేకించి పోతుల సునీత కు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం తో ఆమంచి కృష్ణ మోహన్ నిరుత్సాహ పడ్డారు అని వార్తలు వచ్చాయి. అలాగే, ఆ మధ్య ఒక ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్ల కు, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తనకు తెలిసిన వైఎస్సార్సీపీ నాయకులు తన దగ్గర వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు అని పేర్కొన్న ఆమంచి కృష్ణ మోహన్ అదే ఇంటర్వ్యూలో , పవన్ కళ్యాణ్ కి రాష్ట్రం లో మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చారు . ఆ వ్యాఖ్యలతో, ఆమంచి కృష్ణ మోహన్ కూడా జన సేన పార్టీ లోకి వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అలా అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ ఆయన వైఎస్సార్సీపీలో చేరారు.
ఒక ఛానల్ లో మాట్లాడిన ఆమంచి కృష్ణమోహన్ దీని మీద వివరణ ఇస్తూ తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గతంలో నాలుగు సార్లు కలిశానని, చాలా విషయాలు మాట్లాడుకున్నాము అని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి రమ్మని ఎప్పుడూ తన ని ఆహ్వానించ లేదని, అలాగే జన సేనలోకి వస్తానని తాను పవన్ కళ్యాణ్ ని అడగ లేదని కృష్ణ మోహన్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే , జనసేన నుంచి ఆమంచి కృష్ణ మోహన్ కి సిగ్నల్ రాలేదని, అయితే అదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలు ఆ మంచిని పార్టీలోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నాలు చేశారని, దాంతో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సిపి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.
ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడే గెలిచిన కృష్ణ మోహన్ ఈసారి వైఎస్సార్సీపీ తరఫున గెలవడం దాదాపు నల్లేరు మీద నడక అని చాలామంది భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున నిలబడ్డ అభ్యర్థి స్థానికులు కాకపోవడం, అలాగే వైయస్సార్ సిపి తరపున నిలబడ్డ అభ్యర్థికి ప్రజలలో మంచి గుర్తింపు లేకపోవడం కారణంగా, దీనికి తోడు ఆమంచి కృష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల వచ్చిన సానుభూతి కారణంగా ఆయన సులభంగా గెలిచారని, గత ఎన్నికల్లో పని చేసిన ఆ కారణాలు ఈసారి పనిచేయవని వీరు అంటున్నారు. దీనికి తోడు ఆయన ఎమ్మెల్యే గా ఉన్న ఈ కాలంలో కొంత మంది వైఎస్ఆర్ సీపీ నేతలు చీరాల నియోజకవర్గ పరిధిలో వైఎస్ రాజ శేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తే, దాన్ని ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగా అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వై యస్ ఆర్ అభిమానుల నుంచి ఆమంచి పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు అదే వైఎస్సార్ అభిమానులు పాత విషయాన్ని మర్చిపోయి ఆమంచి కృష్ణమోహన్ కి ఓటు వేస్తారా అని కూడా వీరు ప్రశ్నిస్తున్నారు.
అయితే అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ మీద పెద్దగా ఎటువంటి వ్యతిరేక ఆరోపణలు లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశం. మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ ఈ ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థిగా గెలుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.