తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చర్చించడానికి గవర్నర్ వద్దకు వెళ్లిన కేసీఆర్.. మంత్రి వర్గ విస్తరణ ముహుర్తం కూడా ఖరారు చేశారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి రోజున .. ఉ.11.30కి రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయించాలని నిర్ణయించారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని… అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలన్నదానిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేశారు. మూడు రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉండి.. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్సీ పదవులు, ఇతర కార్పొరేషన్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై కసరత్తు చేసి ఓ అంచనాకు వచ్చారు.
ఈ సారి పూర్తి స్థాయి మంత్రి వర్గం ఉండదని.. చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే ఎనిమిది నుంచి పది మంది వరకు.. మంత్రి వర్గంలో ఉంటారని చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు తప్ప.. అందరూ కొత్తవారికే అవకాశాలు దక్కనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రదానంగా లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించడం.. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు రావడం ఖాయమని నమ్ముతూండటంతో… విస్తరణ వ్యూహాత్మకంగా ఉండబోతోందని చెబుతున్నారు. హరీష్, కేటీఆర్ లకు ఈ విడత చోటు లేనట్లేనని కొంత కాలంగా మీడియా వర్గాలకు సమాచారం ఇస్తూ వస్తున్నారు. పరిమితంగా చేసినా.. మంత్రివర్గంలో సామాజిక సమతూకం చూసుకోవాలి .. ఆ కోణంలో చూసినా.. కేటీఆర్, హరీష్ కు విస్తరణలో అవకాశం దొరకకపోవచ్చని చెబుతున్నారు.
అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు అనే అంశంపై.. మాత్రం… పూర్తి క్లారిటీగా ఎవరూ చెప్పడం లేదు. కేసీఆర్ కూడా.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. పద్దెనిమిదో తేదీ సాయంత్రం లేదా.. ప్రమాణస్వీకారం రోజు ఉదయం.. స్వయంగా కేసీఆర్ వారికి ఫోన్ చేసి చెబుతారని అంటున్నారు. కొంత మంది పేర్లు బలంగా ప్రచారంలోకి వచ్చినా.. చివరికి సమాచారం వచ్చే వరకూ గ్యారంటీ లేదని.. టీఆర్ఎస్ వర్గాలు ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. ఆశావహులంతా.. కేసీఆర్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు.