ఎన్నికలకు ముందు నెల్లూరు రాజకీయం అమరావతిలో వేడెక్కిస్తుంది. ఎమ్మెల్సీగా ఉండి, రాష్ట్ర మంత్రి వర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వారు తమ పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని పార్టీ హై కమాండ్ ఆలోచనకు అనుగుణంగా సోమిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం శాసనమండలి కార్యదర్శి, ఛైర్మన్ లకు ఆయన తన రాజీనామా లేఖను అందించారు. చంద్రబాబు నుంచి అనుమతి తీసుకుని రాజీనామా చేశానని.. సోమిరెడ్డి మీడియాకు చెప్పారు.
నెల్లూరు నగరం నుంచి మంత్రి నారాయణ రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర రెడ్డి అభ్యర్ధిత్వాన్ని పార్టీ హై కమాండ్ ఇప్పటికే ఖరారు చేసింది. నెల్లూరు నగర మేయర్ గా ఎన్నికైన అజీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిపోయారు. నారాయణ నెల్లూరు నగరం నుంచి పోటీ చేయని పక్షంలో ఆయన స్థానంలో అజీజ్ పోటీ చేస్తారని భావించారు. కానీ, నారాయణ బరిలోకి దిగుతుండటంతో అజీజ్ కు పార్టీ ప్రత్యామ్నాయం చూపించాల్సి వచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇంకా పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంది. ప్రస్తుతం సోమిరెడ్డి ఖాళీ చేసిన ఎమ్మెల్సీకి అజీజ్ కి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత అజీజ్ కు మరలా ఎమ్మెల్సీ స్థానం కొనసాగిస్తారని కూడా అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మంత్రి నారాయణ ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ మార్చితో ముగుస్తుంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో అప్పటికి నామినేషన్ వేసే సమయం కూడా సమీపిస్తుంది. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన, రాజీనామా చేసిన సోమిరెడ్డి, నారాయణలు మరో ఆరు నెలలు మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి.. మంత్రులుగా కొనసాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కడప జిల్లా జమ్మల మడుగు రాజకీయ ఫార్ములాలో భాగంగా.. ఇప్పటికే.. ఓ ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్సీగా మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడికి పదవి ఇస్తారు. ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి.. టిక్కెట్ ఆశావహులకు ఆ పదవులు ఇచ్చి నేతల్ని సర్దుబాటు చేస్తున్నారు చంద్రబాబు.