తెలంగాణలో తెరాస రాజకీయ లక్ష్యాల్లో ఒకటి… టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించి, అసెంబ్లీలో టీడీపీ ఉనికి లేకుండా చేయడం. తెలంగాణలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరే. వారిద్దరూ తెరాసలోకి వచ్చేస్తారంటూ ఈ మధ్య చాలా కథనాలే వచ్చాయి. ముఖ్యంగా, సండ్ర వెంకట వీరయ్య చేరిక విషయమై ఆ మధ్య చాలానే చర్చ జరిగింది. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో అందరికంటే ఆలస్యంగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అయితే, తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని గమనిస్తే… పార్టీ మారేందుకు సండ్రకు పూర్తి స్వేచ్ఛ లభించిందని చెప్పొచ్చు.
సండ్రకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వాన్ని ఏపీ ఇచ్చింది. అయితే, ఆయన నెలరోజులలోపే ప్రమాణం స్వీకారం చేయాల్సి ఉన్నా, ఆయన స్పందించలేదు. టీటీడీ సభ్యత్వం తీసుకుంటారా లేదా అనేది కూడా ఆయన ప్రభుత్వానికి చెప్పలేదు. దీంతో ఆయన సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో, ఆయనకి పార్టీ మారేందుకు కావాల్సినంత స్వేచ్ఛ వచ్చిందని చెప్పుకోవచ్చు. తెరాసలో చేరేందుకు సొంత పార్టీ టీడీపీ నుంచి కూడా ఆయనకి లైన్ క్లియర్ అయినట్టే అని ఓరకంగా చెప్పొచ్చు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను కూడా విలీనం చేసుకునే ప్రక్రియను తెరాస ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి, తెరాసలో చేరేందుకు సండ్ర కొన్నాళ్ల కిందట్నుంచే సిద్ధంగా ఉన్నారు. అయితే, ఆయనతోపాటు మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా వచ్చేస్తే… ఒకేసారి చేర్చుకోవాలనే ఉద్దేశంతో తెరాస వాయిదా వేస్తూ వచ్చినట్టు సమాచారం. సండ్ర తెరాసలో చేరితే… ఆయనకి మంత్రి పదవి కూడా దక్కుతుందనే ప్రచారం ఉంది. త్వరలో విస్తరించబోతున్న మంత్రివర్గంలో సండ్రకు చోటు ఉంటుందా లేదన్నది ఇంకా స్పష్టత లేదుగానీ… ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరిగేలోపుగానే టీడీపీ ఎమ్మెల్యేల విలీనంపై కూడా తెరాస అధినాయకత్వం దృష్టి పెడుతోందనే కథనాలు వినిపిస్తున్నాయి.