ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లు ఖరారు చేసిన ఎమ్మెల్సీలకు … చంద్రబాబు ఓ షరతు పెడుతున్నారు. ముందుగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రజల మద్దతు పొందాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి.. సోమిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి గెలిచి తీరుతాననే నమ్మకంతో ఉన్న సోమిరెడ్డి.. ఎమ్మెల్సీని త్యాగం చేసి.. ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు.. ఇలా.. మరో ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా బాటలో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సోమిరెడ్డి రాజీనామా చేసేసి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి.. మిగతా వాళ్లు కూడా సోమిరెడ్డిని అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మంత్రులుగా ఉన్న నారా లోకేష్, పొంగూరు నారాయణలు.. ఎమ్మెల్సీలుగా ఉన్నారు. నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమే. ఏ నియోజకవర్గం అన్నదానిపై… చంద్రబాబు ఇంకా బయటకు రాలేదు. మంత్రి పొంగూరు నారాయణ.. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయబోతున్నారు. వీరిద్దరూ తమ ఎమ్మల్సీలకు పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. అయితే పొంగూరు నారాయణ పదవి కాలం.. మార్చితో ముగుస్తుంది. రాజీనామా అవసరం లేదన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. ఇక పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, అన్నం సతీష్ కూడా.. ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. పయ్యావుల కేశవ్ తన నియోజకవర్గం ఉరవకొండలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. అన్నం సతీష్ బాపట్ల టిక్కెట్ ఆశిస్తున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ను.. తాడికొండ నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ కాకపోతే.. ఏదో ఓ చోట నుంచి పోటీ చేయించడం ఖాయమేనని చెబుతున్నారు. ఈ క్రమంలో వీరందరూ పదవులకు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితిని సోమిరెడ్డి కల్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా.. ఎమ్మెల్సీ పదవులతోనే… పోటీ చేయమని.. వారిని ప్రొత్సహించే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే.. టీడీపీలో పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు. వారికి వీరు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించి బుజ్జగించే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే.. సోమిరెడ్డి రాజీనామా చేసిన.. ఎమ్మెల్సీ సీటును.. నెల్లూరు మేయర్ అజీజ్‌కు ఖరారు చేయబోతున్నారు. మిగిలిన వారు ఖాళీ చేసే స్థానాలను… కూడా… ఆశావహులకు కట్టబెట్టి… వలసలు నివారించుకునే ప్రయత్నం చేయనున్నారు.