వైకాపాలో వలసల సందడి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు వచ్చి చేరుతూ ఉండటంతో మరింత చర్చనీయం అవుతోంది. అయితే, ఇప్పుడు వస్తున్న ఈ వలసల్ని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మారుతున్న పరిణామంగా చూడలేం. అనూహ్యంగా ప్రజల్లో వైకాపాకి బలమొచ్చేసిందనీ చెప్పలేం. వాస్తవానికి గడచిన కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం పట్ల మరింత సంతృప్తి వ్యక్తమౌతున్న పరిస్థితి ఉంది. తాజా వలసల్ని కేవలం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోణం నుంచి మాత్రమే చూడాలి.
దాసరి జయరమేష్ విషయం తీసుకుంటే.. ఆయన చాలాకాలంగా టీడీపీలో అంతృప్త నేతగానే ఉన్నారు. ఆయన దగ్గుబాటి గ్రూపులో ఉండేవారు. దగ్గుబాటి ఈ మధ్యనే వైకాపావైపు వెళ్లారు కాబట్టి… దాసరి అటువైపు అడుగులు వేయడం అనూహ్య పరిణామం కాదు. ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా… విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. టీడీపీలో అది సాధ్యం కానట్టుగా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. పైగా, సీఎం చంద్రబాబుతో ఆయనకి ఎప్పట్నుంచో పొసగడం లేదనేది అందరికీ తెలిసిందే. దీంతో సీటు కావాలంటే పార్టీ మారాల్సిన పరిస్థితే ఆయనది.
ఆమంచి విషయమే తీసుకుంటే… ఆయనకి తెలుగుదేశం పార్టీలోనే స్థానికంగా ఒక బలమైన వ్యతిరేక వర్గం ఉంది. దాంతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం ఎప్పుడూ ఆయన చెయ్యలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కినా, ఆ వర్గం తనను ఓడిస్తుందనే భయం ఆయనలో ఉంది. ఒకవేళ ఆ వర్గమే లేకపోయి ఉంటే… ఆమంచి పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఇంకోటి, పనిచేసిన వారికే అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెబుతున్నారు. పార్టీ వర్గాలతో కాకుండా, ఇతర సంస్థలతో నాయకుల పనితీరు మీద సీఎం సర్వేలు చేయించుకున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఎవరికి సీట్లు దక్కవో అనే ఒక చర్చ పార్టీ వర్గాల్లో ఇప్పటికే జరుగుతోంది. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో వైకాపాలోకి వెళ్లిపోతే… టీడీపీని విమర్శించడం ఈజీ అవుతుందన్నది ఆమంచి వ్యూహం. ఆయన పార్టీ మార్పునకి కారణం ఇదే. పార్టీ మార్పుని ప్రజాభిప్రాయంగా ఆయన మీడియా ముందు చెప్పుకోవచ్చుగానీ… ఆయన అభిప్రాయమేంటో ప్రజలు అర్థంకాని పరిస్థితి అయితే లేదు.
అవంతి శ్రీనివాస్ విషయం తీసుకుంటే… భీమిలి సీటు విషయంలో ఆయనకి ఇబ్బంది ఎదురైంది. గతంలో పీఆర్పీ తరఫున ఆయన భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తరువాత కాంగ్రెస్ లోకి వచ్చాక… మంత్రి గంటా శ్రీనివాసరావుతో మంచి స్నేహం ఆయనకి ఉంది. ఈ ఇద్దరూ కలిసే టీడీపీలోకి వచ్చారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే పరస్పర ఒప్పందంతోనే ఇద్దరూ పార్టీలోకి వచ్చారు. అయితే, ఇప్పుడు ఒక సీటు విషయంలో ఇద్దరూ పట్టుదలకు పోతున్నారు. నిజానికి, ఈ ఇద్దరూ కూర్చుకుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యే ఇది. గంటాతో మాట్లాడే ప్రయత్నమే ఆయన చెయ్యకుండా… నేరుగా పార్టీ నాయకత్వం మీద నిందలు వేసేస్తూ బయటకి వెళ్లిపోయారు. అంటే, అవంతి పార్టీ మార్పునకు కారణం ఆయన వ్యక్తిగత అంశమే.
ఇలా టీడీపీ నుంచి బయటకి వెళ్లిన నాయకులంతా.. ఇప్పుడు ప్రత్యే హోదా గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని మాట్లాడుతున్నారు, అనవసరంగా కులాల ప్రస్థావన తెస్తున్నారు. విడివిడిగా చూస్తుంటే వీరంతా టీడీపీని వదిలి వెళ్లింది వారివారి వ్యక్తిగత కారణాలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ వలసల్ని తమకు పెరుగుతున్న బలంగా వైకాపా వైకాపా కూడా భావించలేని పరిస్థితి. అందుకే, టీడీపీ అధినాయకత్వం కూడా వీటిపై పెద్దగా స్పందించడం లేదు.