తెలంగాణ సీఎం కేసీఆర్ “రైతు బంధు” అనే పథకం పెట్టి రైతుబంధుగా మారారు. అయితే.. ఎకరానికి రూ. నాలుగు లేదా ఐదు వేలు ఇచ్చినంత మాత్రానే రైతు బంధు అవుతారా..? వారికి గిట్టుబాటు ధరలు కల్పించవద్దా..? ఈ విషయంలో ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తోందా.. అన్నదే కీలకంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కొన్నాళ్ల కిందట.. ఎస్సారెస్పీ నీటి కోసం… జరిగిన ఆందోళనలు… కలకలం రేపాయి. ఎన్నికలకు ముందుగా జరిగిన గొడవలు కాబట్టి.. హుటాహుటిన .. సింగూరు నుంచి జలాలను తరలించి… సమస్యను.. దాదాపుగా పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు.. రైతులు మరో సమస్యపై ఉద్యమిస్తున్నారు. అదే గిట్టుబాటు ధరలు.
నిజామాబాద్ జిల్లాలో ఎర్ర జొన్న, పసుపు రైతులు గుట్టుబాటు ధర కోసం.. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆర్మూరులో ఓ రోజు మహా ధర్నా చేపట్టారు. పసుపు మద్దతు ధర 15 వేలు, ఎర్రజొన్నకు 3500 రుపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వారికి ఈ మేరకు.. గత ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం.. రైతుల ఆందోళనను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతోంది. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు సంఘాల నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతు సంఘాలు పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. ఇప్పుడు వాళ్లు మరింత దూకుడైన ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
ఇప్పుడు.. తెలంగాణలో రైతుల సమస్యలపై దృష్టి పెట్టే వ్యవస్థ లేదు. ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే.. ముందుగా.. వ్యవసాయ మంత్రి వద్దకు వెళ్తారు. అలాంటి మంత్రి..తెలంగాణలో విధులు నిర్వహించి ఐదు నెలలు దాటిపోయింది. అసెంబ్లీని రద్దు చేసిన తరవాత ఏ మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించలేదు. ఎన్నికలు అయిపోయి.. రెండు నెలలు అయినా వ్యవసాయమంత్రి లేరు. ఇప్పుడు రైతులకు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. రైతులకు భరోసా ఇచ్చే వారు కూడా లేరు. మీడియా కూడా.. ఈ సమస్యను… గట్టిగా ప్రజల ముందుకు తీసుకెళ్లే స్థితిలో లేదు.