ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేజ్రీవాల్ తోపాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా ఏపీకి వచ్చారు. అయితే, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలే కీలకంగా ఈ ఇద్దరి మధ్యా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే, ఎన్నికల ముందే వీలైనంత వరకూ పొత్తులను లాక్ చేసుకోవడం కోసం భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం కొంత వర్కౌట్ అవుతున్న పరిస్థితి మహారాష్ట్రలో కనిపించింది. శివసేనతో భాజపా పొత్తు దాదాపు ఖరారు. ఆ రాష్ట్రంలో సగం సగం ఎంపీ సీట్లలో పోటీకి ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో, భాజపాయేతర పార్టీలన్నీ పొత్తులను అధికారికంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మోడీ వ్యతిరేక పార్టీలన్నీ సభలూ సమావేశాలూ అంటూ ఈ మధ్య కాస్త వేగం పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు పార్టీల మధ్య పొత్తులు అనేవి ఇంకా జరగలేదు. ఇంతకీ ఈ ప్రక్రియ ఎన్నికల ముందు ఉంటుందా, తరువాత ఉంటుందా అనే చర్చ కూడా ఈ పార్టీల మధ్య చర్చకు వచ్చినట్టుగా కూడా కనిపించడం లేదు. భాజపాకి వ్యతిరేకంగా సభల నిర్వహణపై మాత్రమే ప్రస్తుతానికి వారి ఫోకస్ అంతా ఉంది. కానీ, ఇప్పుడు పొత్తుల్ని అధికారికం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే, ఎన్నికల తరువాత.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా ప్రీ పోల్ అలయెన్స్ కే అవకాశం ఇస్తారు. చంద్రబాబు, కేజ్రీవాల్ భేటీలో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది.
ఇక, ప్రత్యేకంగా చంద్రబాబునే ఆయన కలవడం వెనక కారణం తెలిసిందే. జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీలను ఏకం చేయగలిగేది ఏసీ సీఎం అనొచ్చు. జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న గతానుభవంగానీ, ప్రస్తుతం భాజపా మీద రాజకీయ పోరాటంలో భాగంగా ఆయన తీసుకుంటున్న చొరవగానీ క్రియాశీలక పాత్రకు అవకాశం కల్పించింది. ఆ దిశగా ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడంతోపాటు, కోల్ కతా తరహాలో ర్యాలీల నిర్వహణను వీలైనంత త్వరగా ప్రారంభించేలా ప్రయత్నించాలనేది చంద్రబాబు, కేజ్రీవాల్ భేటీలోని మరో కీలకాంశంగా కూడా తెలుస్తోంది. మహారాష్ట్రలో పరిణామాలు కూడా ఈభేటీలో ప్రస్థావనకు వచ్చాయనీ అంటున్నారు.