టాలీవుడ్ స్టార్ నాగార్జున.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ ఇంట్లో కలిశారు. అరగంట సేపు జగన్ తో చర్చలు జరిపారు. సమావేశం తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఏ అంశంపై చర్చలు జరిపారన్నదానిపై క్లారిటీ లేదు. నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం.. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. నాగార్జున గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని.. చెబుతున్నారు. అయితే.. దీనిపై నాగార్జున స్పందనేమిటో ఇంత వరకూ అధికారికంగా వెల్లడి కాలేదు.
నాగార్జున.. వైఎస్ హయాం నుంచి .. వైఎస్ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ తో కలిసి.. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో వ్యాపారాలు చేశారు. ఆ తర్వాత మ్యాటిక్స్ ప్రసాద్ జైలుకు వెళ్లినప్పుడు కూడా.. నాగార్జున పలుమార్లు.. చంచల్ గూడకు వెళ్లి జగన్ తో పాటు..మ్యాటిక్స్ ప్రసాద్ ను పరామర్శించారు. ఏపీలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా.. నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజు.. చురుకుగా.. వెళ్లి… నాగార్జున మాట.. అంటూ.. వైసీపీ తరపున ప్రచారం చేస్తూంటారు. నంద్యాల ఉపఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రామరాజు చాలా హడావుడి చేశారు. ఇదంతా నాగార్జునకు తెలిసే జరిగింది. లేకపోతే ఆయన ఖండించేవారని.. ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. నాగార్జున ఇంత వరకూ.. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ప్రజాజీవితంలోకి వచ్చే అంశంపైనా… ఎప్పుడూ సానుకూల ప్రకటన చేయలేదు. నాగార్జున లైఫ్ స్టైల్ చూసిన వారు..ఆయన రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదు. కానీ.. జగన్ మాత్రం.. గుంటూరు పార్లమెంట్ సీట్లో.. గల్లా జయదేవ్ ను ఢీకొట్టాలంటే… నాగార్జున లాంటి స్టార్ అవసరం అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అందుకే.. నాగార్జునపై ఒత్తిడి పెంచుతున్నారని చెబుతున్నారు. సహజంగా…జగన్ ను ఫలానా వారు కలుస్తున్నారని బయటకు తెలియాలంటే… . వైసీపీ సన్నిహిత మీడియా వర్గాలకు లోటస్ పాండ్ నుంచి సమాచార వస్తుంది. అలాగే నాగార్జున విషయంలోనూ వచ్చింది. అంటే.. ఇలా భేటీ విషయం బయటకు తెలిస్తే.. నాగార్జునపై ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని చెబుతున్నారు. మరి నాగార్జున ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననేది ఆసక్తికరంగా మారింది.