హైదరాబాద్: ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ యాక్టివిటీ ముమ్మరంగా సాగనుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న కాపు గర్జన సభ మధ్యాహ్నం ఒంటిగంటకు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభం కానుంది. మరోవైపు హైదరాబాద్‌లో జరుగనున్న గ్రేటర్ ఎన్నికలకు ప్రచారం ఈ సాయంత్రం ఐదుగంటలకు ముగియనుంది.
కాపు గర్జనకు తుని సన్నద్ధమయింది. పదిలక్షలమంది హాజరవుతారని నిర్వాహకుల అంచనా. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు పళ్ళంరాజు, హరిరామజోగయ్య, దాసరి నారాయణరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, కేశవరావు సభకు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. జాతీయ రహదారి అంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. సభకు హాజరయ్యే లక్షలమందికి అన్నివైపులనుంచీ కనిపించేలా 16 భారీ ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. రెండు వేలమంది పోలీసులను మోహరించారు. వాహనాలకోసం 11 చోట్ల 160 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో ఇబ్బంది లేకుండా మూడు లక్షలమందికి భోజనం అందిస్తారు. అధికార తెలుగుదేశంపార్టీ ఈ సభను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ పార్టీలకు చెందిన కాపు నాయకులు మాత్రం సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్రేటర్ ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. పాదయాత్రలో ప్రారంభమైన గ్రేటర్ ప్రచారం ఇప్పుడు బహిరంగసభలు, బైక్ ర్యాలీలకు చేరుకుంది. నిన్న టీఆర్ఎస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగసభ విజయవంతం కావటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ లక్ష బైక్‌లతో నగరంలో ర్యాలీ నిర్వహించనుంది. మరోవైపు ఇవాళ ప్రచారం ముగించుకుని రేపు ఓటర్లను ప్రలోభాలతో ఆకట్టుకునేందుకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.