హైదరాబాద్: వదిన భువనేశ్వరికూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారంటూ కేసీఆర్ నిన్న పరేడ్ గ్రౌండ్స్‌లో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కీలక నేత లోకేష్ ఇవాళ రిటార్ట్ ఇచ్చారు. లోకేష్ ఇవాళ మియాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. సీఎమ్ క్యాంప్ ఆఫీసులో పనిచేసేవారు కొందరు కేసీఆర్ సతీమణి దగ్గరకు వెళ్ళి, హైదరాబాద్‌లో అందరూ టీడీపీకి ఓటేద్దామని అనుకుంటున్నారని, మీరేమనుకుంటున్నారని అడిగారని, ఎవరికి ఓటు వేయాలో తనకూ అర్థం కావటంలేదని ఆమె అన్నారని లోకేష్ చెప్పారు. సీఎమ్గారేమో ఎమ్ఐఎమ్తో పొత్తు పెట్టుకున్నట్లు చెబుతున్నారని, కవితేమో పొత్తు లేదని చెబుతోందని, కేటీఆరేమో భీమవరంలో పోటీ చేస్తున్నాడని అంటున్నాడని కేసీఆర్ సతీమణి అన్నట్లు లోకేష్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రచారంపై కూడా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రచారానికి వెళ్ళనని తన సతీమణితో చెప్పినట్లు లోకేష్ చెప్పారు. ఎటు చూసినా టీడీపీ అభివృద్ధే తప్ప తాను చేసిందేమీ కనబడటంలేదని అన్నట్లు తెలిపారు. ఒకపక్క చూస్తే హైటెక్ సిటీ, మరోపక్క చూస్తే ఫ్లైఓవర్, మెట్రోరైల్, గాంధీ ఆసుపత్రి అన్నీ టీడీపీ కట్టినవే కేసీఆర్‌కు కనిపిస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ కారు పొల్యూషన్ సృష్టిస్తుంటే, టీడీపీ సైకిల్‌తో హైదరాబాద్ సంక్షేమానికి సొల్యూషన్ తీసుకొస్తుందని లోకేష్ చెప్పారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తన తల్లితో వివరణ ఇప్పిచ్చిన సంగతి తెలిసిందే.