హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం చల్లబడిందనుకుంటున్న తరుణంలో ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో అది మళ్ళీ రాజుకున్నట్లయింది. నోటీసుకు స్పందించి ఇవాళ తమముందు హాజరైన సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సండ్రను ఏడుగంటలు విచారించిన తర్వాత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో ఇది నాలుగవ అరెస్ట్. తెలుగుదేశం తెలంగాణ నేతలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. సండ్రకు శనివారం ఇచ్చిన రెండో నోటీసు సెక్షన్ 41-ఏ కింద ఉండటంతో ఆయనను అరెస్టు చేసే అవకాశాలుంటాయని ముందే ఊహాగానాలు సాగాయి. అలాగే ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. సండ్ర ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో తనను మొదట సంప్రదించింది సండ్ర అని ఫిర్యాదుదారు స్టీఫెన్సన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఈకేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య ఇప్పటివరకు నిందితులు కాగా, ముత్తయ్య తప్ప అందరినీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ముత్తయ్య అరెస్ట్ చేయకుండా హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. సండ్ర రేపు బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.