కర్నూలు జిల్లాలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తనకు సినిమాలంటే మొదట్నుంచీ ఇష్టం లేదనీ, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నదే తన లక్ష్యం అన్నారు. మా మామ ముఖ్యమంత్రి, మా తాత ముఖ్యమంత్రి, ఇలాంటి కథలు చెప్పడానికి తాను రాలేదన్నారు. ఇక్కడ మనకు ఎవ్వరూ లేరనీ, మనదే మొదటి తరమనీ, అన్నీ నేర్చుకుందామని విద్యార్థులతో పవన్ అన్నారు. ఇక్కడున్న రౌడీ మూకల్నిచూసి భయపడొద్దనీ, రాజకీయాలంటే భయం వద్దని విద్యార్థులకు చెప్పారు. రాజకీయాలంటే విలువలు గల వ్యక్తులు రావాలనీ, వాస్తవానికి ఇక్కడ విలువలున్నవారు ఎవ్వరూ ఇక్కడ లేరన్నారు. ఎందుకంటే, ఇక్కడి రౌడీయిజం తట్టుకునే వ్యక్తిత్వాన్ని చాలామంది కోల్పోయారన్నారు.
ఈరోజు అమరావతి మన రాజధాని ఏమోగానీ, నా మనసుకి కర్నూలే రాజధాని అన్నారు పవన్! జనసేన అధికారంలోకి వచ్చాక… అమరావతి ఎంత స్థాయి నగరం అవుతుందో, దాన్ని మించిన నగరంగా కర్నూలును తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారుగానీ, సీమకు ఎవ్వరూ ఏం చెయ్యలేదన్నారు. కర్నూలుతోపాటు రాయలసీమకు పూర్వవైభవం తాను తీసుకొస్తా అన్నారు. రాయలసీమ వాసిగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రయత్నించి ఉంటే ఆదోనిలో ఒక డిగ్రీ కాలేజీ ఎందుకు రాదన్నారు. ‘మీరు చట్టసభలకు వెళ్లకుండా, రాజకీయాలను వ్యక్తిగత క్రీడగా భావిస్తుంటే ఎలా’ అని ప్రశ్నించారు. చట్ట సభలకు వెళ్లకుండానే తాను ఇన్ని సమస్యల్ని బయటకి తీసుకొచ్చినప్పుడు, ప్రతిపక్ష నేతగా ఆయన ఎంత చేసి ఉండాలన్నారు. రాయలసీమ వెనకబడి ఉందంటే కారణం ఇక్కడి నాయకులే అని విమర్శించారు. తాను అధికారాన్ని బాధ్యతగా చూస్తానని పవన్ అన్నారు. ఇక్కడి విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతీ అంశాన్ని పరిశీలిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
తన మనసుకి కర్నూలే రాజధాని అని పవన్ వ్యాఖ్యానించడం కొంత చర్చకు దారి తీసే అంశమే. కర్నూలు అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇవ్వడంలో ఎలాంటి తప్పూలేదు. ఈ క్రమంలో, కర్నూలు తన మనసుకు దగ్గరైతే అమరావతి ఏంటనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చేలా పవన్ స్పందించారు. రాయలసీమను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. మరి, పట్టిసీమగానీ, కియా ఫ్యాక్టరీగానీ, జరుగుతున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలుగానీ… ఆ ప్రాంతం వెనుకబాటును తగ్గించే ప్రయత్నమే కదా ప్రభుత్వం చేస్తోంది. అలాంటివేవీ జరగనట్టుగా పవన్ విమర్శించారు!