బిగ్ బాస్ విజేత కౌశల్ తెలుగు దేశం పార్టీలోకి చేరబోతున్నారా?? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కౌశల్ టీడీపీ పెద్దలకు అతి సన్నిహితంగా ఉంటున్నారని, కౌశల్ అతి త్వరలో పార్టీ కండువా భుజాన వేసుకోవడం ఖాయమని సినీ, రాజకీయ వర్గాల విశ్లేషణ. బిగ్ బాస్ తో కౌశల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కౌశల్ ఆర్మీ పేరిట అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరవాత.. కౌశల్ సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే కౌశల్ రాజకీయ ప్రవేశం చేయడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి తోడు కొంతమంది టీడీపీ నేతలు కౌశల్‌ని విశాఖపట్నం నుంచి బరిలోకి దింపితే బాగుంటుందని చంద్రబాబునాయుడుకి సలహా ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇందుకు సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. కౌశల్‌ది విశాఖపట్నమే. అక్కడ కౌశల్‌కి చెందిన సామాజిన వర్గం ఓట్లు కూడా బలంగా వచ్చే అవకాశాలున్నాయని లెక్కలు వేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ విజయంతో కౌశల్‌కి సినిమా అవకాశాలు వరుస కడతాయని భావించారంతా. బిగ్ బాస్ విజేతగా బయటకు వచ్చినప్పుడు నిజంగానే కొంతమంది దర్శక నిర్మాతలు కౌశల్ ని సంప్రదించారు. ఆ వేడిలో ఆయా సినిమాలు ప్రారంభమవ్వాల్సింది కూడా. కానీ… సినిమాల పరంగా కౌశల్ సాధించిందేం లేకుండా పోయింది. ఇప్పుడు రాజకీయాల మాట కూడా అంతేనా.?? ఒకవేళ కౌశల్ నిలబడితే.. గెలిచేంత సత్తా, ఆర్థిక స్థోమత కౌశల్‌కి ఉన్నాయా? సినిమా అవకాశాల్లానే ఇది కూడా పాల పొంగులాంటి పరిణామాలేనా?? వీటన్నింటికి అతి తొందరల్లోనే సమాధానాలు దొరికే అవకాశం ఉంది.